NTR Bharosa: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్లపై కీలక అప్‌డేట్!
ప్రతి నెల మొదటి తేదీ.. ఇది చాలామందికి కేవలం క్యాలెండర్‌లోని ఒక రోజు మాత్రమే. కానీ వేలాది వృద్ధులకు అది జీవితం సాగించే రోజు. వితంతువులకు అది నిలబెట్టే నమ్మకం. దివ్యాంగులకు ముందుకు నడిపించే ధైర్యం. ఆ నమ్మకాన్ని ఆ భరోసాను మరింత బలంగా మార్చిన పథకమే ఎన్టీఆర్ భరోసా. ఈ పథకం కింద ప్రభుత్వం అందించే పెన్షన్ మొత్తాలను పెంచుతూ అవసరమైన వారి ఇంటి ముంగిటకే చేరే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో సామాజిక భద్రతకు కొత్త నిర్వచనం ఇస్తోంది.

ఈ పథకం లక్ష్యం కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు. లబ్ధిదారుల గౌరవాన్ని కాపాడటం కూడా. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు లేదా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేయడం ఈ పథకానికి ప్రత్యేకతగా నిలుస్తోంది. పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర వర్గాలకు నెలకు రూ.4,000 చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. గతంలో ఇది రూ.3,000గా ఉండేది. దివ్యాంగులకు రూ.6,000 వరకు, అలాగే కిడ్నీ వ్యాధులు వంటి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రూ.15,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
అర్హులు వీరే..
ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అయి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండటం, కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిలో ఉండటం అవసరం. వృద్ధాప్య పెన్షన్ కోసం కనీస వయస్సు 60 సంవత్సరాలు కావాలి. అలాగే నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, ట్రాక్టర్ మినహా) లేకపోవడం, నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ భూమి లేకపోవడం వంటి నిబంధనలు కూడా వర్తిస్తాయి.
ఎలా ధరఖాస్తు చేసుకోవాలి?
అర్హత కలిగిన వారు ఈ పథకానికి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటో వంటి పత్రాలు సమర్పించాలి. దరఖాస్తు అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హత నిర్ధారిస్తారు. సాధారణంగా 15 నుంచి 20 రోజుల్లో పెన్షన్ మంజూరు అవుతుంది. అదనంగా నవశకం పోర్టల్ ద్వారా దరఖాస్తు స్థితిని కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది.ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పథకం రాష్ట్రంలో సామాజిక భద్రతను బలోపేతం చేస్తూ, అవసరమైన వారికి ఆర్థిక సామాజిక అండగా నిలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
