‘నిమ్మగడ్డ దుర్మార్గం, సంక్షేమ పథకాల అమలులో ఏపీ సర్కారు ముందుకు వెళ్ళకుండా రాజకీయ కుట్ర’ : మంత్రి వెల్లంపల్లి
ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హడావిడిగా స్థానిక సంస్థల ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చారని ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు..
ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హడావిడిగా స్థానిక సంస్థల ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చారని ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏపీ సర్కారు ముందుకు వెళ్ళకుండా రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి హోటల్ లో ప్రైవేట్ మీటింగ్స్ పెట్టుకుని రాజకీయ పార్టీ నాయకులను కలిశారని ఆయన విమర్శించారు. గతంలో ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో చెప్పలేదన్నారు. ఒక్క కరోనా కేసు కూడా లేనపుడు ఎన్నికలు వాయిదా వేసి, వేల కేసులు ఉన్నప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.
వ్యాక్సిన్ పంపిణీ లో అధికార యంత్రాంగం నిమగ్నం అయ్యిందని సిఎస్ కూడా చెప్పారని, నిమ్మగడ్డ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు చూస్తారా లేక రాజకీయ లబ్ది చూస్తారా? అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీల ప్రలోభాలతో నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని, ఎన్నికలకు మేము భయపడే వ్యక్తులం కాదని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఎన్నికలు సరికాదని ఆయన చెప్పారు. ఈ నెల 11 న అమ్మఒడి కార్యక్రమంకు జగన్ శ్రీకారం చుట్టారని, వాటిని అడ్డుకోవడానికి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది అంటున్నారని విమర్శించారు. ఏకపక్షంగా, దుర్మార్గంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారన్న వెల్లంపల్లి, ఇప్పటికైనా నిమ్మగడ్డ ప్రజా శ్రేయస్సు చూడాలని కోరారు. ప్రజా శ్రేయస్సుకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని టీవీ9తో వెల్లంపల్లి వెల్లడించారు.