రైతులకు మరో గుడ్ న్యూస్.. బోర్లు వేయడమే కాదు మోటార్లు ఫ్రీ..
చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయడమే కాకుండా మోటార్లు కూడా ఇస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందిస్తామన్నారు. భూగర్భ జలాల లభ్యతపై శాస్త్రీయంగా అంచనా వేస్తామన్నారు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో మరో హామీని అమలు చేశారు. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. “వైఎస్ఆర్ జలకళ” పథకాన్ని సీఎం జగన్ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. రైతులకు మేలు చేసేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వమే రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించనుంది. అంతే కాదు మరో శుభవార్తను కూడా సీఎం జగన్ రైతులకు వినిపించారు.
చిన్న, సన్నకారు రైతులకు మరో ఊరటనిచ్చే ప్రకటన చేశారు. ఉచితంగా బోర్డు వేయించడంతోపాటు ఉచితంగా మోటార్‌ను సైతం బిగిస్తామని చెప్పారు. ఒక బోరు ఫెయిల్ అయితే మరో బోరు వేయిస్తామన్నారు సీఎం. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల బోర్లు తవ్విస్తామని సీఎం జగన్ తెలిపారు. ఉచిత బోర్ల ద్వారా 5లక్షల ఎకరాలకు సాగునీరు అందునుంది.
“వైఎస్ఆర్ జలకళ” ప్రారంభం సందర్భంగా 163 బోర్లతో కార్యక్రమానికి సీఎం జగన్ మొదలు పెట్టారు. ఈ స్కీమ్ అన్నదాతలకు వరంగా మారనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2వేల 340 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయడమే కాకుండా మోటార్లు కూడా ఇస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందిస్తామన్నారు. భూగర్భ జలాల లభ్యతపై శాస్త్రీయంగా అంచనా వేస్తామన్నారు. బోర్లు అవసరమైన చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ కోరారు.
ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుందనే విష ప్రచారాన్ని ఖండించాలని రైతులకు పిలుపునిచ్చారు సీఎం జగన్. అలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిని నిలదీయాలన్నారు. రైతులకు మంచి జరగనీయకుండా అడ్డుకునే దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థలో ఉన్నామని, కాబట్టి రైతులే అలాంటి వారిని ప్రశ్నించాలని అన్నారు. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడనీయబోమని, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పారు.
సర్వే, బోరు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒకసారి బోరు ఫెయిల్ అయితే రెండోసారి కూడా వేయిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు రిగ్గును ఏర్పాటు చేస్తామన్నారు. 2004లో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ కు శ్రీకారం చుట్టారని సీఎం జగన్ గుర్తు చేశారు.