AP Vaccination: ఏపీలో వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. ఈనెల 16 నుంచి తొలి విడత టీకాల పంపిణీ
ఈనెల 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలుకానుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కరోనా వైరస్‌ను నివారించడానికి దేశంలో వ్యాక్సినేషన్ కు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలుకానుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈనెల 16 నుంచి జరిగే వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలో వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు రాష్ట్రస్థాయి కోల్డ్ స్టోరేజ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేయగా, కర్నూలు, కడప, గుంటూరు విశాఖపట్నంలలో నాలుగు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
18 జిల్లాలలో మొత్తం 1,659 కోల్డ్ స్టోరేజ్ చెయిన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ రవాణా కోసం ప్రస్తుతం 2 నుండి 8 డిగ్రీల ఉష్ణోగ్రతతో 19 రిఫ్రిజరేటెడ్ వ్యాక్సిన్ వ్యాన్లను సిద్ధంగా ఉంచారు. వ్యాక్సినేషన్ కోసం 17,012 మంది ఎఎన్ఎంలు, 7,469 కేంద్రాలలో సిద్ధంగా వున్నారు. వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 6 వాకిన్ కూలర్స్ , 2 వ్యాక్సిన్ ఫ్రీజర్స్ , 65 భారీ డీప్ ఫ్రీజర్‌లు పంపించింది.
అయితే వీటితో పాటు 7,108 కోల్డ్ బాక్సులు, లక్షా 50 వేల 700 జన్ ప్యాక్ లు పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరారు ఏపీ అధికారులు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ నెల వరకూ ఎనిమిది నెలల పాటు నిర్వహించే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవసరమైన వ్యాక్సిన్ డోసులు, వాటి నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంచనాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపారు.
ఏపీలో వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించేందుకు ఆరోగ్య వైద్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి 15 రోజులకోసారి భేటీ కానుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతి సోమవారం భేటీ కానుంది. నగర పాలక సంఘస్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో తహసిల్దార్ నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతి మంగళవారం భేటీ అయి కార్యక్రమ పురోగతిని సమీక్షించనున్నాయి. వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ కమిటీలన్నీ సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తాయి. త్వరలో ప్రారంభం కానున్న తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 3 లక్షల 70 వేల మంది హెల్త్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు.