Viral Video: స్నేక్ క్యాచర్‌పై దూసుకెళ్లిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే గుండె గుభేల్..!
Nepal King Cobra Rescue Video: నేపాల్‌లో 14 అడుగుల భారీ కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. భారీ కింగ్ కోబ్రా నివాస ప్రాంతానికి సమీపంలోని పొలంలోకి రావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్నేక్ క్యాచర్ దీన్ని రెస్క్యూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెస్క్యూ సమయంలో కింగ్ కోబ్రా పదేపదే పడగ విప్పి దాడికి ప్రయత్నించింది. అతి కష్టంమీద కింగ్ కోబ్రాను చివరకు అదుపులోకి తీసుకుని అడవిలో విడిచిపెట్టారు.

నేపాల్‌లోని రౌతహట్ జిల్లాలో 14 అడుగుల భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. నివాస ప్రాంతానికి సమీపంలోని పొలంలో భారీ కింగ్ కోబ్రా కనిపించడతో స్థానికులు భయంతో వణికిపోయారు. స్థానికుల సమాచారంతో స్నేక్ క్యాచర్ ఈ విషసర్పాన్ని రెస్క్యూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పామును పట్టుకునే క్రమంలో అది చాలాసార్లు పడగ విప్పి దాడికి యత్నించడంతో అక్కడ ఉన్నవారు భయంతో వెనక్కి పరుగులు తీశారు. అయితే స్నేక్ క్యాచర్ మాత్రం ఎంతో నేర్పుతో దాన్ని రెస్క్యూ చేశారు.
పొలంలో భారీ కింగ్ కోబ్రా ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ దీపక్ నేపాల్ తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. సుమారు 14 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను రెస్క్యూ చేసే ప్రయత్నించాడు. అయితే ఆ కింగ్ కోబ్రా చాలాసార్లు దూకుడుగా స్పందించి రెస్క్యూ బృందంపై దూసుకొచ్చింది. అయినప్పటికీ తమ అనుభవం, నేర్పుతో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి.. ఆ పామును రెస్క్యూ చేశారు. అనంతరం దానిని సమీప అడవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా వ్యవహరించిన రెస్క్యూ బృందాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జనావాసాల్లోకి వచ్చిన కింగ్ కోబ్రాను.. సరైన సమయానికి పట్టుకోకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కింగ్ కోబ్రా రెస్క్యూ వీడియో చూడండి
While none can beat Shefali 🐍 but look at the size of this massive King 👑
Caught from a Farm in #Rautahat District #Nepal
Gorgeous & a Dapper Chap 🥰😖🤯#Snakes #Cobra #KingCobra #KingOfSnakes #ReptileWorld pic.twitter.com/JgF3uR9zuu
— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) June 20, 2026
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పంగా గుర్తింపు పొందింది. దీని పొడవు 18 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి కాటు వేస్తే విడుదలయ్యే విషం అత్యంత ప్రమాదకరమైనది. అయితే ఇది సాధారణంగా మనుషులపై దాడి చేయదు. తనకు ప్రమాదం ఉందని భావించినప్పుడు లేదా చాలా దగ్గరకు వెళ్లినప్పుడు మాత్రమే దూకుడుగా ప్రవర్తిస్తుంది.
వన్యప్రాణి నిపుణుల సూచనల ప్రకారం, విషసర్పం కనిపిస్తే దాన్ని భయంతో చంపేయడం లేదా స్వయంగా పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. అనుభవం లేకుండా విషసర్పాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశముంది. జనావాసాల్లోకి విషసర్పాలు వస్తే.. ముందుగా అటవీ శాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలి. అనుభవం కలిగిన వారు దాన్ని రెస్క్యూ చేసి.. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతాల్లో విడిచిపెడతారు.
