చెప్పులు లేకుండా నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయటనే కాదు ఇప్పుడు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడుస్తున్నారు. కాళ్లకు ఏమైనా గుచ్చుకుంటాయని భయంతో సాధారణంగా చెప్పులు వేసుకుంటారు. ఇప్పుడంటే రకరకాల చెప్పులు వచ్చాయి కానీ.. పూర్వం అయితే ఎక్కడికైనా.. ఎంత దూరం అయినా చెప్పులు లేకుండానే నడిచేవారు. నడక ఆరోగ్యానికి మంచిదే కానీ.. చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాస్త జాగ్రత్తగా చూసుకుని చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తే ఇంకా మంచిదని అంటున్నారు. ఇలా చెప్పులు లేకుండా నడిచే పద్దతినే గ్రౌండింగ్ అని అంటారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో చక్రాలు ఉత్తేజితం అవుతాయి:
కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమిలో ఉండే పాజిటివ్ శక్తి అనేది.. శరీరంతో కనెక్ట్ అవుతుంది. దీని వల్ల శరీరంలో ఉండే చక్రాలు అనేవి ఉత్తేజితం అవుతాయి. అంతే కాకుండా మనలో కొత్త శక్తి ప్రవహించిన భావన కలుగుతుంది.
రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది:
కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల అరికాళ్లలో ఉండే నరాల మీద ఒత్తిడి పడినప్పుడు.. రక్త ప్రసరణ అనేది సాఫీగా జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఒత్తిడి – నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి:
చెప్పులు లేకుండా నడవడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళనతో పాటు నిద్ర లేమి సమస్యలు కూడా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఎక్కువగా ఒత్తిడి, డిప్రెషన్ కు గురయ్యే వాళ్లు చెప్పులు లేకుండా పచ్చని గడ్డిపై నడిస్తే మరింత మంచిదని చెబుతున్నారు.
కండరాలు స్ట్రాంగ్ గా ఉంటాయి:
చెప్పులు లేకుండా నడవడం వల్ల కాళ్లలో ఉండే నరాలు వేగంగా కదులుతాయి. దీని కారణంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. శరీరంలో పాదాల కండరాలు సున్నితంగా ఉంటాయి. ఇలా చెప్పులు లేకుండా నడవడం వల్ల అవి బలంగా తయారవుతాయి. అంతే కాకుండా తరచుగా కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు చెప్పులు లేకుండా నడిస్తే ఉత్తమం.
అయితే పాదాలకు చెప్పులు లేకుండా నడిచే క్రమంలో దెబ్బలు ఎక్కువగా తగిలే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరిసరాలు పరిశీలించుకుని నడవాలి. కస్త పరిసరాలు శుభ్రంగా ఉన్న ప్రదేశంలో నడిస్తే మంచిది. మొదట ఓ పది నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత అలవాటు అవుతుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.