
ప్రపంచంలో కెల్లా మనదేశంలోనే బంగారం, వెండి ఆభరణాలు ధరించేవారు ఎక్కువగా ఉంటారు. ఇక బంగారం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడ, మగ అనే తేడా లేదు.. అందరూ బంగారు నగలు కొనేందుకు, ధరించేందుకు ఇష్టపడతారు. పేద, మధ్య తరగతి నుంచి ధనవంతుల వరకు అన్ని వర్గాల ప్రజలు గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో తప్పనిసరిగా ఎంతో కొంత బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. అయితే, మనం బంగారు, వెండి ఆభరణాలు కొనడానికి స్వర్ణకారుడి వద్దకు లేదంటే, ఏదైనా దుకాణానికి వెళితే ఈ ఆభరణాలు మీకు ఒక బాక్స్‌లో పెట్టి ఇస్తారు.
కానీ, ఈ బాక్స్‌లో లోపల మొదట గులాబీ రంగు కాగితం ఉంటుంది. ఆ కాగితం లోపల మీ నగలు ఉంటాయి. నగల వ్యాపారులు ఇలా గులాబీ రంగు కాగితంలోనే నగలు ఎందుకు ఇస్తారు..? దీని వెనుక స్పష్టమైన సమాధానం లేదు. కానీ, ఇది ఒక సంప్రదాయం. ఎందుకంటే ఇది పురాతన కాలం నుండి జరుగుతోంది. అంటే పురాతన కాలం నుండి నగల వ్యాపారులు గులాబీ రంగు కాగితంలోనే నగలు ఇస్తున్నారు. అందుకే నేటికీ ఇది అలాగే కొనసాగుతూ వస్తోంది.
అదే సమయంలో నగలను గీతలు పడకుండా కాపాడటానికి ఈ కాగితాన్ని ఉపయోగిస్తారు. నగల వ్యాపారుల అభిప్రాయం ప్రకారం, గులాబీ రంగు కాగితంలో కొంచెం మెటాలిక్ మెరుపు ఉండటం వల్ల, ఈ కాగితంలో నగలను ఉంచడంతో అది మరింత అందంగా, మెరుస్తూ కనిపిస్తుందని చెబుతున్నారు. నగలు కొనేందుకు వచ్చిన కస్టమర్ ఎలా చూపిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనే అంశంపై దృష్టి పెడతారు. ఎందుకంటే ఒక వస్తువుని అమ్మేటప్పుడు దాని బ్యాగ్రౌండ్ బాగుంటేనే ఆ వస్తువు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి