పిల్లలు తినడానికి మొండికేస్తున్నారా..? ఈసారి ఇలా చేసి చూడండి..!
చిన్నపిల్లలు తినే విషయంలో చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు. బలవంతంగా తినిపించడంపై ఎక్కువ శ్రద్ధ పెడితే పిల్లలకు ఆహారం పట్ల విసుగు వస్తుంది. అలా కాకుండా సరైన పద్ధతులు, ప్రేమతో అలవాట్లు నేర్పిస్తే తినే విషయంలో వాళ్లు మెల్లిగా ఆసక్తి చూపించగలరు.

పిల్లలు తినడానికి మొండికేస్తే చాలా మంది తల్లిదండ్రులు బలవంతంగా తినిపిస్తుంటారు. కానీ ఇలా చేస్తే పిల్లలకు తినడం అంటేనే విసుగు పుట్టొచ్చు. అలా కాకుండా వాళ్లకి తినడం పట్ల ఆసక్తి పెంచే కొన్ని పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.
ఆకర్షణీయంగా ఆహారం
పిల్లలు ఇష్టంగా తినాలంటే వారికి ఇచ్చే ఆహారం చూడగానే ఆకర్షణీయంగా ఉండాలి. పండ్లు, కూరగాయలను జంతువుల బొమ్మల్లా కట్ చేసి ప్లేట్ లో పెట్టడం లేదా రకరకాల రంగులతో అలంకరించడం వల్ల వాళ్లకు తినాలనే కోరిక పెరుగుతుంది.
కొద్దికొద్దిగా ఎక్కువసార్లు
ఒకేసారి ఎక్కువ తినిపించాలని బలవంతం చేయకుండా.. తక్కువ పరిమాణంలో ఆహారం ఇవ్వడం మంచిది. రోజులో మూడుసార్ల బదులు.. చిన్న చిన్న భాగాలుగా ఎక్కువ సార్లు ఆహారం ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
తినే సమయంలో కథలు
పిల్లలకు తినే సమయాన్ని సంతోషంగా మార్చడానికి.. కథలు చెప్పడం లేదా సరదాగా మాట్లాడటం వంటివి చేయొచ్చు. దీని వల్ల పిల్లలకు ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు కుటుంబ బంధం కూడా బలపడుతుంది.
ఇష్టమైన వాటిలో పోషకాలు
పిల్లలకు నచ్చే వంటకాల్లో పోషకాలున్న పదార్థాలను కలిపితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఉదాహరణకు వాళ్లకు నచ్చిన చపాతీలో కూరగాయల పొడి కలపడం లేదా ఇతర పోషకాలున్న వాటిని చక్కగా కలిపి ఇవ్వడం చేయొచ్చు.
మీరు తింటేనే పిల్లలు తింటారు..
పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టంగా తింటే.. మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అలాగే తినడానికి ఇష్టపడతారు. మీకు భోజనం పట్ల ఉన్న ఆసక్తి వాళ్లలో కూడా వస్తుంది.
బలవంతం వద్దు
పిల్లలు ఇష్టంగా తినాలంటే వాళ్ళని బలవంతం చేయకుండా.. ఆహారం పట్ల ప్రేమ పెరిగేలా చేయాలి. వాళ్ళకి ఎప్పుడు ఆకలి వేస్తుందో గమనించి ఆ సమయంలో తినిపించడం ద్వారా క్రమంగా మంచి అలవాట్లను నేర్పించవచ్చు. బలవంతంగా తినిపిస్తే భవిష్యత్తులో వాళ్ళకి తినడం అంటేనే ఇష్టం లేకపోవచ్చు.
పిల్లలకు తినే అలవాట్లు నేర్పించడం కాస్త కష్టమైన పనే. కానీ ప్రేమ, ఓర్పు, సరైన పద్ధతులు పాటిస్తే అది సాధ్యమే. తినేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా.. సరదాగా, ఆనందంగా ఉండేలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.




