
మన భారతదేశంలో అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో మాంసాహారం ప్రోటీన్లు, విటమిన్ల వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది భారతీయులు నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. ఒక సర్వే ప్రకారం దేశ జనాభాలో 85 శాతం మంది నాన్ వెజ్ తింటున్నారట. మరి భారతదేశంలో ఎక్కువగా మాంసం తినే రాష్ట్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ మంది శాకాహారులు ఉన్న దేశం. అయినప్పటికీ, నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఇష్టపడేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువ. 2015-16లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-4) ప్రకారం, వారానికి 78 శాతం మహిళలు, 70 శాతం పురుషులు చేపలు, చికెన్ లేదా ఇతర మాంసాహారం తింటున్నారట. కొన్ని రాష్ట్రాల్లో నాన్ వెజ్ ప్రియుల సంఖ్య 100 శాతం వరకు ఉంది.
నాన్-వెజిటేరియన్ ఆహారం ఎక్కువగా తినే రాష్ట్రాల్లో నాగాలాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 99.8 శాతం మంది మాంసాహారం తింటారు. ఇక్కడి ప్రత్యేక వంటకాల్లో స్మోక్ చికెన్, మటన్, బాంబూ స్టైల్ చేపల వంటలు ఉంటాయి. అలాగే, పశ్చిమ బెంగాల్ 99.3 శాతంతో రెండో స్థానంలో ఉండగా, కేరళ 99.1 శాతంతో మూడవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలు చేపలు, చికెన్, ఇతర మాంసంతో తయారయ్యే రుచికరమైన వంటకాలతో ప్రసిద్ధి చెందాయి.
తెలుగు రాష్ట్రాలు మాంసాహార వినియోగంలో మరింత ముందుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ 98.25 శాతం జనాభాతో నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఎక్కువగా తినే రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో మగవాళ్లలో 98.8 శాతం, ఆడవాళ్లలో 98.6 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. ఇక్కడ వెజిటేరియన్ల సంఖ్య కేవలం 2 శాతం లోపే ఉంది.
తమిళనాడు 97.65 శాతం జనాభాతో నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడే రాష్ట్రాలలో ఒకటి. ఒడిశాలో 97.35 శాతం మంది ప్రజలు సముద్ర ఆహారం, ఇతర మాంసాహార వంటకాలను ఇష్టపడుతారు. అయితే పంజాబ్‌లో నాన్-వెజిటేరియన్ వినియోగం తక్కువగా ఉంది. అక్కడ నెలకు సగటున 205 గ్రాముల చికెన్, 3 గుడ్లను మాత్రమే తీసుకుంటారు. ఇది ఈశాన్య, దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.