Newborn Facts: తల్లికి కూడా తెలియదు.. అప్పుడే పుట్టిన శిశువు తొలి ఏడుపుకు అర్థం ఏంటో తెలుసా?..
సినిమాలలో అయినా, నిజ జీవితంలో అయినా బిడ్డ పుట్టగానే మొదట వినిపించేది ఏడుపే. నవజాత శిశువు తొలి భావోద్వేగం నవ్వు కాకుండా ఏడుపు ఎందుకు అవుతుందనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కేవలం సెంటిమెంట్ కాకుండా, సైన్స్, ప్రకృతి, మానవ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పుట్టిన వెంటనే బిడ్డ ఎందుకు ఏడుస్తుంది? ఏడుపు దేనికి సంకేతం? తెలుసుకుందాం.

ప్రపంచంలోకి అడుగుపెట్టిన శిశువు వెంటనే ఏడవడం అనేది సర్వసాధారణ దృశ్యం. ఈ ఏడుపు, తన అవసరాలను లేదా ఇబ్బందిని తెలియజేసే ప్రాథమిక మార్గం. అంతేకాక, ఇది శిశువు జీవితానికి అత్యవసరమైన శారీరక మార్పుకు సంకేతం. గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే బిడ్డ ఏడవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, ఆరోగ్యానికి దాని ప్రాముఖ్యతను ఈ కథనంలో విశ్లేషిద్దాం.
బిడ్డ పుట్టగానే ఏడుపుతో తొలి భావోద్వేగం వ్యక్తపరుస్తుంది. ఈ సంఘటన తరచుగా చూసేది. అందుకే బిడ్డలు పుట్టిన వెంటనే ఎందుకు ఏడుస్తారు అనే విషయం మీద ఎవరూ పెద్దగా దృష్టి పెట్టరు. ఈ తొలి స్పందనలో సైన్స్, ప్రకృతి, మానవ జీవితానికి లోతైన సంబంధం ఉంది. మాట్లాడడం రాకముందే, తన అవసరాలు, ఇబ్బంది తెలియజేసే ముఖ్యమైన మార్గం ఈ ఏడుపు. శిశువు బతికి ఉండడానికి దోహదపడే సహజ ప్రతిస్పందన ఇది.
శిశువు తొలి ఏడుపు అర్థం ఏంటి?
నవజాత శిశువులు పుట్టిన తరువాత ఏడవడం సాధారణం. ఇది మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన సంకేతం. బిడ్డ శరీరం వ్యవస్థలు ఆన్ అయ్యాయి అని దీని అర్థం. పుట్టగానే నొప్పి వలన శిశువులు ఏడవరని వైద్యులు చెబుతారు. శిశువు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు ఉపయోగించే అప్ గార్ స్కోర్ లో ఈ ఏడుపు ముఖ్యమైంది. బిడ్డ ఏడుస్తుంది అంటే, ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ పనిచేస్తున్నాయి అని అర్థం. ఒకవేళ బిడ్డ ఏడవకపోతే, శ్వాస మొదలయ్యేలా వైద్యులు వీపు మృదువుగా రుద్దడం లేదా పాదాలను సున్నితంగా తట్టడం చేస్తారు.
పుట్టిన వెంటనే ఏడవడం వెనుక కారణం
తొమ్మిది నెలలు శిశువు గర్భంలో వెచ్చని ద్రవంతో నిండిన వాతావరణంలో ఉంటుంది. అప్పటివరకూ శిశువు ఊపిరితిత్తులు ద్రవంతో నిండి ఉంటాయి. నిజమైన శ్వాస ఎప్పుడూ తీసుకోలేదు. శిశువు పుట్టిన తరువాత, ఊపిరితిత్తులలోకి గాలి మొదటిసారిగా వేగంగా చేరుతుంది. లోపల అకస్మాత్తుగా ఏర్పడే ఈ ఒత్తిడి చిన్న గాలి సంచులను విస్తరింపజేస్తుంది. ఇది ఏడుపుకు శ్రీకారం చుట్టి, శరీరంలో ఆక్సిజన్ ప్రసరణకు సహాయపడుతుంది. వైద్యులు దీనిని బిడ్డ మొదటి ‘సిస్టమ్ ఆన్’ క్షణం అని కూడా పిలుస్తారు.
అంతేకాక, పరిసర వాతావరణంలో, ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు కూడా శిశువులో సహజమైన ఏడుపును ప్రేరేపిస్తాయి. గర్భంలో స్థిరంగా 37°C ఉష్ణోగ్రత ఉంటుంది. బయటి ప్రపంచంలోకి వచ్చిన వెంటనే బిడ్డ చల్లని గాలి, ప్రకాశవంతమైన లైట్లు, పెద్ద శబ్దాలు, భూమి గురుత్వాకర్షణకు లోనవుతుంది. ఈ నాటకీయ మార్పు నాడీ వ్యవస్థకు షాక్ ఇస్తుంది. దాని సహజ ప్రతిస్పందనగా ఏడుపు వస్తుంది.
నవజాత శిశువు తొలి భావోద్వేగం నవ్వడం కాకుండా ఎక్కువగా ఏడుపు అవుతుంది. ఎందుకంటే ఇది మానవ అభివృద్ధిలో సహజమైన, అవసరమైన భాగం. దీని వెనుక ఉన్న సైన్స్ అర్థం చేసుకోవడం వలన, నవజాత శిశువులు బయటి వాతావరణంతో ఎలా కలుస్తారో తల్లిదండ్రులు, పెద్దలు అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది.




