Dhanushkodi Tragedy: సముద్రంలో మునిగిపోయిన రైలు! భారతదేశపు అతిపెద్ద విషాదానికి 59 ఏళ్లు..

అది ఒక మామూలు శీతాకాలపు రాత్రి.. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో గమ్యం చేరుతామన్న తరుణంలో రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును సముద్రం తనలో కలిపేసుకుంది. ధనుష్కోడి చరిత్రను శాశ్వతంగా మార్చేసిన ఆ భయంకర విషాదానికి 59 ఏళ్లు నిండాయి. ఆ నాటి గుండె కోతను మరోసారి గుర్తు చేసుకుందాం.

Dhanushkodi Tragedy: సముద్రంలో మునిగిపోయిన రైలు! భారతదేశపు అతిపెద్ద  విషాదానికి 59 ఏళ్లు..
Dhanushkodi Train Disaster

Updated on: Dec 23, 2025 | 8:35 PM

ఒకప్పుడు కళకళలాడిన పట్టణం.. నేడు నిర్మానుష్యమైన శిథిలాల కుప్ప. ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన ధనుష్కోడి కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. 25 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డ అలలు ఒక రైలును ఏ విధంగా తుడిచిపెట్టాయో తెలిస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో చెప్పడానికి ధనుష్కోడి ఒక నిదర్శనం. 59 ఏళ్ల క్రితం సరిగ్గా డిసెంబరు 22న సంభవించిన పెను తుపాను ఒక నిండు పట్టణాన్ని శ్మశానంగా మార్చేసింది. ఆ రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ భారతీయుల మదిలో చెదరని గాయంగా మిగిలిపోయింది.

నిమిషాల్లోనే అంతం 1964 డిసెంబరు 22వ తేదీ రాత్రి 11:55 గంటలకు పాంబన్ నుంచి ధనుష్కోడికి ప్యాసింజర్ రైలు బయలుదేరింది. అందులో 110 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మరికొద్దిసేపట్లో రైలు ధనుష్కోడి చేరుకుంటుందనగా 240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, 25 అడుగుల ఎత్తున ఎగసిపడ్డ అలలు రైలును చుట్టుముట్టాయి. లోకో పైలట్ తేరుకునేలోపే రైలు పట్టాలు తప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. రైలు ఆచూకీ కూడా దొరకలేదంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

శిథిలాల మధ్య చరిత్ర ఆ తుపాను ధాటికి కేవలం రైలు మాత్రమే కాదు.. ధనుష్కోడి పట్టణం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. రైల్వే స్టేషన్, ఆసుపత్రి, చర్చి, పాఠశాలలు కుప్పకూలిపోయాయి. క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబైన చర్చి శిథిలావస్థకు చేరుకుంది. నాటి ప్రమాదానికి సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ కొన్ని గోడలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా.. అధికారులు రైలును అనుమతించడం పెద్ద తప్పిదంగా మిగిలిపోయింది.

నిర్మానుష్యంగా పట్టణం ఒకప్పుడు శ్రీలంకకు ఫెర్రీ సర్వీసులతో రద్దీగా ఉండే ధనుష్కోడి.. ఇప్పుడు ఒక ‘ఘోస్ట్ టౌన్’ (నిర్మానుష్య ప్రాంతం). రాత్రి వేళల్లో అక్కడ ఉండటానికి స్థానికులు భయపడతారు. పగటిపూట దుకాణాలు నడుపుకునే వారు కూడా సాయంత్రం కాగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఆనాటి తుపాను గుర్తులు నేటికీ పర్యాటకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి.