Doordarshan: మన టీవీకి 62 ఏళ్లు.. దూరదర్శన్‌గా మొదలైన అడుగులు.. ఇప్పుడు నెట్‌వర్క్ నీడలో పరుగులు..

ఇప్పుడు మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వినోదాన్ని అందిస్తోంది టెలివిజన్. మన దేశంలో టెలివిజన్ తొలి ప్రసారం ఎప్పుడు అయిందో తెలుసా? దూరదర్శన్ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసుకుందాం.

Doordarshan: మన టీవీకి 62 ఏళ్లు.. దూరదర్శన్‌గా మొదలైన అడుగులు.. ఇప్పుడు నెట్‌వర్క్ నీడలో పరుగులు..
Doordarshan
Follow us

|

Updated on: Sep 15, 2021 | 8:41 AM

Doordarshan: ఒక్కసారి టీవీ లేని ప్రపంచాన్ని ఊహించండి. అసలు ఊహకే అందడం లేదు కదూ! సరిగ్గా 62 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి. టీవీ అనేది ఊహకు అందని విషయం. రేడియో ఒక్కటే వార్తా ప్రసార సాధనం. మన దేశంలో 1959 సెప్టెంబర్ 15న తొలి టీవీ ప్రసారాలు ప్రయోగాతమకంగా మొదలు అయ్యాయి. ఇప్పుడు మనం 24 గంటలూ టీవీ చూడగలుగుతున్నాం. కానీ, అప్పుడు టెలివిజన్ ఇండియా పేరుతో రోజుకు అరగంట.. అదీ వారానికి మూడురోజులు మాత్రమే టీవీ కార్యక్రమం ప్రసారం అయ్యేది.

దూరదర్శన్ ఒక ప్రయోగంగా భారతదేశంలో ప్రారంభించారు. టెలివిజన్ ఇండియా పేరుతో. ప్రారంభంలో, పాఠశాల పిల్లలు, రైతుల కోసం విద్యా కార్యక్రమాలు ఆల్ ఇండియా రేడియో ద్వారా దూరదర్శన్ లో ప్రసారం అయ్యేవి. అదీ వారానికి మూడురోజులు. 1965 నుండి, కార్యక్రమాలు ప్రతిరోజూ ప్రసారం చేయడం ప్రారంభించారు. అంటే.. మన దేశంలో టీవీ ప్రసారాలు మొదలైన ఆరేళ్ళకు పూర్తిస్థాయిలో ప్రసారాలు ప్రారంభం అయ్యాయి.

శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్ (SITE) 1975 లో దేశంలోని 6 రాష్ట్రాలలో ప్రారంభించారు. ఆ సమయంలో ఈ రాష్ట్రాల్లో కమ్యూనిటీ టెలివిజన్ సెట్లు ఏర్పాటు చేశారు. మొదట్లో ఆల్ ఇండియా రేడియోలో భాగంగా దూరదర్శన్ పనిచేసేది. 1976 లో దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో నుండి విడిపోయింది.

1982 భారతదేశంలో టీవీకి ముఖ్యమైన సంవత్సరం. అదే సంవత్సరంలో, దూరదర్శన్ INSAT-1 ద్వారా మొదటిసారిగా జాతీయ ప్రసారాన్ని చేసింది. ఆసియా క్రీడల ప్రసారం దూరదర్శన్ మానిఫోల్డ్ ప్రజాదరణను పెంచింది. ఇక్కడే టీవీ రూపాంతరం చెందింది. ప్రజలకు చేరువ కావడం ప్రారంభం అయింది. కొత్త కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. క్రమంగా కార్యక్రమాలు ఉదయం, మధ్యాహ్నం మళ్లీ ప్రసారం కావడం ప్రారంభించాయి. వారానికి రెండుసార్లు చిత్రహార్.. ఆదివారం రంగోలి వంటి సినిమా పాటల కార్యక్రమాలు మొదలయ్యాయి. తరువాత క్రమేపీ నాటకాలు.. సీరియల్స్.. ఇలా తన పరిధిని విస్తరించుకుంటూ పోయింది దూరదర్శన్. దూరదర్శన్ 1966 లో కృషి దర్శన్ పేరుతో ప్రారంభించిన రైతుల కార్యక్రమం మన దేశంలో హరిత విప్లవాన్ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించింది.

క్రమంగా దూరదర్శన్ దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రాంతీయ భాషల్లో ప్రసారాలు మొదలు అయ్యాయి. మొదట్లో రోజూ రెండు గంటల పాటు ప్రాంతీయ ప్రసారాలు ఉండేవి. ఇందులో ప్రధానంగా వార్తలు.. రైతు కార్యక్రమాలు.. విద్యా సంబంధిత కార్యక్రమాలు ఉండేవి. వారానికి ఒకసారి సినిమా పాటల కార్యక్రమం ప్రసారం అయ్యేది. తెలుగులో చిత్రలహరి పేరుతో ఈ కార్యక్రమం వచ్చేది. దీనిని చూడటానికి ప్రజలు ఎగబడేవారు. ఇప్పుడు దూరదర్శన్ లో 34 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. దూరదర్శన్ దేశవ్యాప్తంగా 66 స్టూడియోలను కలిగి ఉంది. వీటిలో 17 రాష్ట్ర రాజధానులలోనూ మిగిలినవి 49 వివిధ నగరాల్లో ఉన్నాయి. దూరదర్శన్ దేశంలోనే అతిపెద్ద ప్రసారకర్తగా ఇప్పటికీ నిలిచింది.

ఇప్పుడు ఎన్ని శాటిలైట్ ఛానల్స్.. ఇంటర్నెట్ టీవీ వంటివి అందుబాటులోకి వచ్చినా దూరదర్శన్ కు తన ప్రత్యేకమైన వ్యూయర్ షిప్ ఉంది. మన దేశంలో మెల్లగా మొదలైన టీవీ ప్రస్తానం.. గత దశాబ్దంలో వేగవంతమైన మార్పులతో ప్రపంచ సమాచార రంగంతో పోటీ పడి ఎదిగింది.

అప్పట్లో వేసిన అరగంట ప్రయోగాత్మక అడుగు.. ఇప్పుడు రంగుల దృశ్యాలతో.. టెలివిజన్ నెట్‌వర్క్ పేరుతో ఇటు దూరదర్శన్ గానూ.. అటు ప్రయివేట్ రంగంలోనూ పరుగులు తీస్తోంది.

మీకు తెలుసా?

దూరదర్శన్ లో సూపర్ హిట్ కార్యక్రమం అంటే.. రామాయణం. ఇది మొదటిసారి ప్రసారం అయినపుడు సంచలనం సృష్టించింది. అయితే, అంతకు మించిన సంచలనాన్ని ఏప్రిల్ 2020లో మళ్ళీ దూరదర్శన్ రామాయణం ప్రసారం అయినపుడు జరిగింది. రామాయణం సీరియల్ 16 ఏప్రిల్ 2020 ఎపిసోడ్ ను 7.7 కోట్ల మంది చూశారు. ఇది ఒకే రోజులో మొత్తం టెలివిజన్ చరిత్రలో ఏ వినోద ప్రసరానికైన అత్యధిక వ్యూయర్‌షిప్.

ఇవి కూడా చదవండి:

Boat Accident: పాపం.. దైవ దర్శనానికి వెళ్ళారు.. పడవ మునిగి గల్లంతయ్యారు.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

TVS Fiero125: TVS పాత బైక్‌ ఇప్పుడు కొత్త మోడల్‌లో..! ధర ఎంతో తెలుసా..?