
సాధారణంగా విగ్రహావిష్కరణలు చాలా జరుగుతుంటాయి. అవి స్థానికంగా ఒకటి రెండు రోజులు చర్చకు దారితీసి.. ఆతర్వాత అదొక ల్యాండ్ మార్క్ గా మిగిలిపోతుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించిన ఓ విగ్రహం ఇప్పుడు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఓ నగర మాజీ మున్సిపల్ చైర్మన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇంకా చెప్పాలంటే ఆ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
తమిళనాడులోని తూత్తుకూడి.. ట్యూటికొరియన్ అని కూడా పిలుస్తారు. చరిత్రాత్మక నగరంగా పేరొందిన ఈ ప్రాంతానికి చెందిన రావు బహదూర్ క్రూజ్ ఫెర్నాండెజ్(Cruz Fernandes). 1869లో జమిందార్ కుటుంబంలో జన్మించారు. ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త. వ్యాపారాల్లో కోట్లాది రూపాయలు సంపాదించారు. కానీ ఆ సమయంలో తూత్తుకూడి ప్రాంతంలో సమస్యలు తాండవిస్తున్నాయి. 1909 లో క్రూజ్ ఫెర్నాండెజ్ ట్యూటికొరిన్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అంతకు ముందు నుంచే ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని చాలామంది ఆహ్వానించారు. అయితే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తాను రాజకీయాలకు చెందిన వ్యక్తిని కాదని.. అలా ఎప్పటికి నన్ను చూడొద్దని చెప్పిన గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు క్రూజ్ ఫెర్నాండెజ్. అప్పటి నుంచి వరుసగా ఐదు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యి రికార్డు సృష్టించారు. 1925 వరకు ఆయన తూత్తుకూడి మున్సిపల్ ఛైర్మన్ పదవిలో కొనసాగారు.
అప్పట్లో అనేక సమస్యలు ఉన్న తూత్తుకూడిలో ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య. ఇప్పుడైతే ఉన్న ఊర్లో నీళ్లు లేకపోతే పక్క ఊరి నుంచి బైక్ లోనో, ఆటో లోనో నీరు తెచ్చుకోగలం.. కానీ ఆరోజుల్లో నీరు చూడాలన్నా కనీసం 50 కి.మీ.దూరం వెళ్లాల్సిందే. ఫెర్నాండెజ్ ఆలోచనతో తూత్తుకూడితో పాటు తిరునల్వేలి, పలయం కోట్టై పట్టణాలకు తాగునీటి ఎద్దడి నివారణకు ఉమ్మడి పథకాన్ని సిద్ధం అయింది. వల్లనాడు సమీపంలోని తమిర భరణి నది నుంచి మున్సిపాలిటీ కి నీరు తీసుకొచ్చే పథకానికి రూపకల్పన చేశారు. మున్సిపల్ కౌన్సిల్ అనుమతితో పనులు ప్రారంభం అయ్యాయి. అనుకున్న సమయానికి పథకం పూర్తయింది. అప్పట్లో అక్కడి ప్రజలకి అదొక భగీరథ విజయమే.. అక్కడి ప్రజలకు ఫెర్నాండెజ్ ఒక భగీరథుడే. అలాగే మున్సిపాలిటీ లో నీటి సమస్యతో పాటు మాస్టర్ ప్లాన్ అమలు, డ్రైన్ సిస్టం ఇంకా అనేక చర్యలు అప్పట్లో తమిళనాడులోని మిగిలిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ల కంటే భిన్నంగా ఉండేవి. దీంతో ఫెర్నాండెజ్ ను ఫాదర్ ఆఫ్ తూత్తుకూడిగా పిలిచేవారు.
అప్పటి నుంచి ఫెర్నాండెజ్ కుటుంభ సభ్యులను ఎంతో గౌరవంగా చూస్తూ వస్తున్నారు స్థానిక ప్రజలు. స్థానికంగా జరిగే పర్వదినాల్లో, స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన వారసులకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి యేటా ఆయన జన్మదిన వేడుకలను కూడా స్థానికులు ఘనంగా జరుపుకుంటూ.. ఆయన నగరానికి చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఫెర్నాండెజ్ 154వ జయంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ట్యూటికొరిన్‌లో ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. సుమారు 12 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. 2021లో తమిళనాడులో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు రూ.77.87 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తూత్తుకూడి ప్రజలు ఎప్పటికీ మరువలేని వ్యక్తిగా మిగిలిపోయిన ఫెర్నాండెజ్ కు దక్కిన గౌరవంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తరానికి, తూత్తుకూడి ప్రజలకు తప్ప తమిళనాడులో ఎవరికీ తెలియని ఫెర్నాండెజ్ గురించి ఇపుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా నిలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..