ఈ కపుల్ ఆలోచనకు మీరూ ఫిదా అవ్వాల్సిందే.. గెస్టులను ఎలా ఆహ్వానించారో చూడండి!
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున వరంగల్ నగరంలో ఓ జంట వినూత్నంగా పెళ్లి వేడుక జరుపుకుంది. సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న వరుడు సాయిచంద్ ఆడంబరాలకు పోకుండా పర్యావరణ హితం కోరుతూ, ప్లాస్టిక్ ఫ్రీ పెళ్లి వేడుకను నిర్వహించుకున్నాడు. పత్రికల పంపిణీ నుండి పెళ్లి, విందు వరకు అంతా డిఫరెంట్ థీమ్‌తో పెళ్లి వేడుక జరుపుకుని జనమంతా చర్చించుకునేలా చేశాడు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున వరంగల్ నగరంలో ఓ జంట వినూత్నంగా పెళ్లి వేడుక జరుపుకుంది. సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న వరుడు సాయిచంద్ ఆడంబరాలకు పోకుండా పర్యావరణ హితం కోరుతూ, ప్లాస్టిక్ ఫ్రీ పెళ్లి వేడుకను నిర్వహించుకున్నాడు. పత్రికల పంపిణీ నుండి పెళ్లి, విందు వరకు అంతా డిఫరెంట్ థీమ్‌తో పెళ్లి వేడుక జరుపుకుని జనమంతా చర్చించుకునేలా చేశాడు. మండపమంతా మొక్కలే.. ఆ పెళ్లికి వచ్చిన వారికి మొక్కలే రిటర్న్ గిఫ్ట్స్.. డిఫరెంట్ థీమ్ తో జరిగిన ఆ పెళ్ళి వేడుక ఔరా అనిపించింది.
ప్రపంచం అంతా కాలుష్యం బారినపడుతోంది. మనిషి మనుగడ పాలిట శాపంగా మారిన ప్లాస్టిక్ మనిషి నిత్య జీవితంలో భాగమైంది. ప్రాణవాయువు ఇచ్చే చెట్లు మాత్రం కనుమరుగవుతున్నాయి. భావితరాలు బాగుండాలంటే, ప్లాస్టిక్ ఫ్రీ సమాజం, చెట్లను పెంచి ప్రకృతిని కాపాడడం తప్ప, మరో మార్గం లేదని భావించాడు వరంగల్ లోని విద్యానగర్ కు చెందిన గుండపు సాయిచంద్. హైదారాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సాయిచంద్ తన పెళ్లి వేడుక ద్వారా సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇవ్వాలని భావించాడు. అందుకోసం వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.
పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు తన పెళ్లికి ప్రపంచ పర్యావరణ దినోత్సవమే శుభ ముహూర్తమని ఫిక్స్ అయ్యాడు. అతిధులకు ఆహ్వాన పత్రిక నుండి మొదలుకొని పెళ్ళి వేడుకలో భోజనాల వరకు అంతా ప్లాస్టిక్ రహిత వివాహమే. పత్రికలతో పాటు వినూత్నంగా స్టీల్ బాటిల్, మొక్కలు అందించాడు. తన వెంట గడ్డపార తీసుకెళ్లిన వరుడు బంధువుల ఇండ్ల వద్ద తానే స్వయంగా మొక్కలు నాటి పెళ్లికి రావాలని కోరాడు. అంతే కాకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్ వాడకుండా వివాహం జరుపుకుంటున్నాడు.
పెళ్లికి హాజరైన బంధువుల కోసం రిటర్న్ గిఫ్టుగా జూట్ బ్యాగులు, మొక్కలు పంపిణీ చేసి ఔరా అనిపించారు ఈ నవ దంపతులు. అలాగే పెళ్లి కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ గ్లాసులు, వుడ్ ప్లేట్స్ వినియోగించారు. నవ దంపతులను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి జ్యూట్ బ్యాగులతోపాటు మొక్కలు అందిస్తూ వాటిని కుటుంబ సభ్యుల పెంచుకోవాలని సందేశం ఇచ్చారు. పెళ్లి మండపం మొత్తం మొక్కలతో నింపేశారు. పర్యావరణాన్ని రక్షించాలని సందేశాలు ఇస్తున్న ఫ్లకార్డులను ఏర్పాటు చేశారు.
పెళ్లి కుమారుడు సాయిచంద్ బావ ప్రశాంత్, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం కొన్నేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తన బావ చేస్తున్న సామాజిక సేవకు ఆకర్షితుడై సాయిచంద్ సైతం పర్యావరణ ప్రేమికుడిగా మారిపోయాడు. పర్యావరణ మార్పుల వల్ల కలుగుతున్న అనర్థాలను తెలుసుకుని జీవితాంతం ప్రకృతిని కాపాడే చర్యలు తీసుకుంటానని ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పనులు చేయాలని పిలుపునిస్తున్నారు.
వీడియో చూడండి..
పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు సహాయం చేస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఒక్కరం ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత భవిష్యత్తు కోసం కలిసి నడవాలని పిలుపునిద్దాం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..