Metro: ఇది విన్నారా.. మెట్రోలో నిద్రపోతే ఫైన్.. ఎంత కట్టాలో తెలిస్తే షాకే..
మీరు మెట్రోలో అలసటగా ఉండి చిన్న కునుకు తీస్తున్నారా..? అయితే జాగ్రత్త..! మెట్రోలో ప్రయాణించేటప్పుడు నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం నిషేధం. మెట్రోలో నేలపై కూర్చున్నా లేదా పడుకున్నా భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ ఫైన్ రూ.2,500 నుండి రూ.7,500 వరకు ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పెద్ద నగరాల్లో మెట్రో రైలు ప్రయాణం రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ పనులతో అలసిపోయిన చాలా మంది ప్రయాణికులు, తమ గమ్యస్థానం చేరుకోవడానికి కొద్ది సమయం ఉంది కదా అని, కళ్లు మూసుకుని 10 నిమిషాలు నిద్రపోదాం అని అనుకుంటారు. అయితే జాగ్రత్తగా ఉండండి.. మీరు మెట్రోలో ఇలా నిద్రపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మన దేశంలో కాదు.. దుబాయ్ మెట్రోలో ఉంది.
నిద్రపోతే ఫైన్..!
ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయాణ మార్గాలలో ఒకటిగా ఉన్న దుబాయ్ మెట్రోలో ప్రయాణించేటప్పుడు నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం వంటి వాటిని నిషేధించారు.పొరపాటున ఎవరైనా రైలులో నిద్రపోయినా, నేలపై కూర్చున్నా, పడుకున్నా వారికి జరిమానా విధిస్తారు.
ఎంత జరిమానా..?
దుబాయ్ మెట్రో నిబంధనల ప్రకారం.. మీరు రైలులో నేలపై కూర్చున్నా లేదా పడుకున్నా 100 నుండి 300 దిర్హామ్‌ల వరకు జరిమానా విధిస్తారు. ఈ మొత్తం భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2,500 నుండి రూ.7,500 వరకు ఉంటుంది. ఇటీవల ఒక ప్రయాణీకుడు చేసిన పోస్ట్ వైరల్ అయిన తర్వాత.. దుబాయ్ మెట్రోలోని ఈ కఠినమైన నియమాలు మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఏం చేయకూడదు..?
మెట్రోలో ప్రయాణించేటప్పుడు నిద్రపోవడంతో పాటు దుబాయ్ మెట్రో కొన్ని ప్రవర్తనలను నిషేధించింది.
- నేలపై కూర్చోవడం లేదా పడుకోవడం.
- గేటు ముందు నిలబడటం లేదా కూర్చోవడం.
- సీటుపై కాళ్లు పైకి పెట్టి కూర్చోవడం.
- సీటుపై పడుకోవడం.
- మన మెట్రో పరిస్థితి: బెంగళూరుకు వరం
ఒకవైపు దుబాయ్ మెట్రో కఠిన నియమాలు పాటిస్తుంటే మరోవైపు మన దేశంలోని మెట్రో నగరాలకు వరంలా మారింది. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్‌ల నుండి తప్పించుకోవడానికి మెట్రో ప్రయాణం ఉత్తమ మార్గం అని ప్రజలు భావిస్తున్నారు. టికెట్ ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. వేగంగా, సౌకర్యవంతంగా తమ కార్యాలయాలకు చేరుకోవడానికి మెట్రో చాలా సహాయపడుతుంది. అయితే బెంగళూరు మెట్రోతో సహా మన దేశంలోని మెట్రోలలో కూడా ప్రయాణికులు తమ తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించకుండా కొన్ని సాధారణ నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
