Pakistan Traffic Rules: పాకిస్తాన్ గురించి తెలుసుకోవడానికి ప్రతి భారతీయుడు ఆసక్తి కనబరుస్తాడు. ఈ రోజు పాకిస్తాన్‌లో ట్రాఫిక్ నియమాలు ఏ విధంగా ఉంటాయి. చలాన్లు వేస్తే ఎంత చెల్లించాలి. హెల్మెట్ పెట్టుకోకుంటే ఎంత ఫైన్, తాగి డ్రైవ్ చేస్తే ఎంత తదితర విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెషావర్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్‌లో కూడా బైకులకు, కార్లకు వేర్వేరు చలాన్లు వేస్తారు. బైకుకు సంబంధించి జరిమానాలు రూ.100 నుంచి రూ.200 వరకు ఉంటాయి. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే రూ. 500 నుంచి 600 రూపాయల వరకు చలాన్ వేస్తారు. తప్పు దారిలో కారు డ్రైవ్ చేస్తే రూ.200 నుంచి 300 వరకు చలాన్లు వేస్తారు. కొన్ని సమయాలలో ఇది రూ.600 వరకు ఉంటుంది.
బైక్‌ను ఓవర్‌టేక్ చేయడం, వాహనానికి లైట్లు లేకుండా రాత్రిపూట డ్రైవింగ్ చేయడం, రోడ్డుపై రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేయడం, ఎమర్జెన్సీ వాహనాలను అడ్డుకోవడం, రైల్వే ట్రాక్‌ను తప్పుగా దాటడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి వాటికి 100 రూపాయల చలాన్ వేస్తారు. రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం నడపడం, సైలెన్స్ జోన్‌లో హారన్ మోగించడం, తప్పుగా యు-టర్న్ తీసుకోవడం, నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేయడం, పరిమితి దాటి వేగంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్ పాటించకపోవడం వంటి వాటికి రూ.200 చలాన్ వసూలు చేస్తారు. ఎక్కువ వేగంగా కారు నడిపితే 300 రూపాయల వరకు చలాన్ వేస్తారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ ఉపయోగిస్తే రూ.500 నుంచి 600 వరకు ఫైన్ విధిస్తారు.