మొదట రాలుతున్న జుట్టు.. తర్వాత ఊడి వస్తున్న గోళ్లు… కొత్త వ్యాధి కలకలం..!
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలోని షెగావ్ తాలూకాలోని బాండ్‌గావ్‌లో ఒక వింత వ్యాధి వ్యాపించింది. గతంలో గ్రామస్తుల జుట్టు ఊడిపోయింది. ఇప్పుడు వారి చేతి, కాలు గోళ్లు కూడా రాలిపోతున్నాయి. దీని కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఈ వ్యాధిని సీరియస్‌గా తీసుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు.

మహారాష్ట్రలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. బుల్ధానా జిల్లాలోని గ్రామాల్లో అకస్మాత్తుగా జుట్టు రాలడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మూడు నెలలు గడిచినా, ఈ వ్యాధికి సరైన చికిత్స కనుగొనలేకోపోతున్నారు. ఇంతలో ఇప్పుడు ఈ గ్రామాల్లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జుట్టు కోల్పోయిన వారి వేలుగోళ్లు, కాలి గోళ్లు ఇప్పుడు కుళ్ళిపోతున్నాయి. దీనివల్ల విరిగిన గోళ్లు రాలిపోతున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
బుల్ధానా జిల్లాలోని షెగావ్, ఖంగావ్, నదుర తాలూకాలోని కొన్ని గ్రామాలలో, జనవరి నెలలో అకస్మాత్తుగా ఒక వ్యాధి ఉద్భవించింది. ఇది గ్రామస్తులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. జనవరి నెలలో చాలా మంది గ్రామస్తులకు అకస్మాత్తుగా జుట్టు రాలడం ప్రారంభమైంది. ఇది చూసి గ్రామస్తులు చాలా భయపడ్డారు. జుట్టు రాలడం వార్తల తరువాత, కేంద్రం నుండి ICMR నిపుణుల బృందం కూడా బుల్ధానాకు చేరుకుంది. పరీక్షలు నిర్వహించింది.
ఐసిఎంఆర్ బృందం ఈ గ్రామాలను సందర్శించి, రోగుల వెంట్రుకలు, ఇతర నమూనాలను పరీక్ష కోసం సేకరించింది. కానీ ఐసిఎంఆర్ నివేదిక ఇంకా రాలేదు. అయితే, శరీరంలో సెలీనియం స్థాయిలు పెరగడం వల్ల జుట్టు రాలడం సమస్య ఏర్పడిందని పరిశోధనలో తేలింది. ఇప్పుడు ఈ గ్రామాల్లో మరోసారి కొత్త సమస్య తలెత్తింది.
షెగావ్ తహసీల్‌లోని బాండ్‌గావ్‌లో, జుట్టు రాలడంతో బాధపడుతున్న రోగుల చేతులు, కాళ్ల గోళ్లు కూడా కుళ్ళిపోవడం, విరిగిపోవడం, రాలిపోవడం మొదలైంది. ఇది గ్రామస్తులను కలవరపెట్టింది. జుట్టు రాలడం తర్వాత, గోళ్లు దెబ్బతిన్నాయని, రాలిపోతున్నాయని ఫిర్యాదులు రావడం ఆరోగ్య శాఖకు మళ్లీ కొత్త సవాలుగా మారింది. గోర్లు పడిపోవడానికి కొత్త కారణాన్ని తెలుసుకోవడానికి రాష్ట్ర వైద్య బృందం CMO, CO గ్రామానికి చేరుకున్నారు.
ఇప్పటివరకు 25-30 మంది గోర్లు దెబ్బతిన్నాయని, రాలిపోయాయని బాండ్‌గావ్ సర్పంచ్ రాజన్ బన్సోడే తెలిపారు. ఈ రోగులలో ఎక్కువ మంది గతంలో జుట్టు రాలడం సమస్య ఉన్నవారే కావడం విశేషం. ఇప్పుడు వారి గోర్లు కూడా రాలిపోతున్నాయి. కొంతమంది రోగులు జుట్టు రాలడం అనే సమస్యను ఇంతకు ముందు ఎప్పుడూ ఎదుర్కోలేదు కానీ వారి గోళ్లు రాలిపోతున్నాయి. దీనివల్ల ప్రజల్లో భయానక వాతావరణం నెలకొని ఉంది. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే వైద్య సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలావుంటే, ఐసిఎంఆర్ దర్యాప్తు నివేదిక కూడా ఇంకా విడుదల కాలేదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
