Indian Currency: భారతదేశం విభిన్న సంస్కృతులు , సంప్రదాయాలతో కూడిన సువిశాల దేశం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భిన్న సంప్రదాయాలు, భాషలు, సామాజిక అలవాట్లను కలిగి ఉంది. ఈ వైవిధ్యమే ఆయా ప్రాంతాల్లో అక్కడ సంస్కృతికి సంప్రదాయాలకు చిహ్నంగా విభిన్న నిర్మాణ స్మారక చిహ్నాలను నిర్మించారు. ఆ నిర్మాణాలు భారతదేశం గర్వించగలిగేలా చేశాయి. ఆ స్మారక చిహ్నాలు, క్లిష్టమైన నమూనాలు మన దేశం ఇంజనీరింగ్ నైపుణ్యానికి, హస్తకళాకారుల పరిపూర్ణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. వీటిలో కొన్ని స్మారక చిహ్నాలు మన దేశ కరెన్సీ నోట్లలో చోటు సంపాదించాయి. ఈరోజు అటువంటి స్మారక చిహ్నాలను కలిగి ఉన్న కరెన్సీ నోట్ల గురించి తెలుసుకుందాం..
10 రూపాయల నోటు:
జనవరి 5, 2018న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ముద్రించిన రూ.10 నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రం, వెనుక వైపు ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం చిత్రం ఉన్నాయి. ఇది ఒడిశాలోని కోణార్క్‌లో 13వ శతాబ్దపు సూర్య దేవాలయం. దీనిని 1250లో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు నరసింహదేవ I నిర్మించినట్లు చరిత్రకారుల కథనం. ఒడియా లిపిలో సంస్కృతంలో వ్రాసిన ప్రణాళిక, నిర్మాణ రికార్డులు భద్రపరచబడిన కొన్ని హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. 1960లలో ఒక గ్రామంలో ఒక తాళపత్ర గ్రంథం లభించింది. ఈ తాళపత్ర గ్రంథం అనంతరం అనువదించబడింది. దీంతో కోణార్క్ దేవాలయం నిర్మాణాన్ని శివ సామంతరాయ మహాపాత్ర పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఇది పాత సూర్య దేవాలయం సమీపంలో నిర్మించబడింది. పాత ఆలయం గర్భగుడి తిరిగి ప్రతిష్టించబడింది. కొత్త ఆలయంలో విలీనం చేయబడింది. రాగి పలకల శాసనాలు ద్వారా కోణార్క్ ఆలయ నిర్మాణ గొప్పదనం తెలుస్తోంది. 1984లో, UNESCO ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. చంద్రభాగ మేళా సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో కోణార్క్ దేవాలయానికి హిందువులు వెళ్లే ఒక ప్రధాన యాత్రా స్థలం.
20 రూపాయల నోటు:
కొత్త రూ.20 నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ చిత్రపటం, వెనుకవైపు ఎల్లోరా గుహల ఉన్నాయి. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ఇందులో మొత్తం 100 గుహలు ఉన్నాయి. వీటిలో 34 ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఎల్లోరా స్మారక చిహ్నాలు ఒకదానికొకటి దగ్గరగా నిర్మించబడింది. ఇది ప్రాచీన భారతదేశంలో ఉన్న మత సామరస్యాన్ని చిహ్నం. రాష్ట్రకూట రాజవంశం పాలనలో ఎల్లోరాలో హిందూ, బౌద్ద, జైన దేవాలయాలున్నాయి. యాదవ రాజవంశం అనేక జైన గుహలను నిర్మించింది. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్రింద ఒక రక్షిత స్మారక చిహ్నం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా.
50 రూపాయల నోటు
రూ.50 నోటు వెనుకవైపు కర్ణాటకలోని హంపి రాతి రథం ఉంది. ఇది 1986లో యునెస్కోచే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడంగా.. 1986లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. వాస్తవానికి ఈ రథం గరుడుడికి అంకితం చేయబడిన ఒక మందిరం. దీనిని విట్టల ఆలయ సముదాయం లోపల నిర్మించారు. భారతదేశంలోని మూడు ప్రసిద్ధ రాతి రథాలలో హంపి రథం ఒకటి. మిగిలిన రెండు ఒడిశాలోని కోణార్క్ , తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న రాతి రథాలు. చరిత్రకారుల ప్రకారం.. హంపిలోని స్మారక చిహ్నాలు 14వ, 16వ శతాబ్దాల మధ్య విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడ్డాయి. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు కృష్ణదేవరాయ ఒడిశాలో యుద్ధం చేస్తున్నప్పుడు కోణార్క్ సూర్య దేవాలయ రథాన్ని చూసి ఆకర్షితుడై ఈ రథాన్ని నిర్మించాడు. రథం ఉన్న ప్రదేశం నుండి కదిలితే ప్రపంచం ఆగిపోతుందని స్థానికుల నమ్మకం.
100 రూపాయల నోటు
2018లో ఆర్‌బిఐ ఆవిష్కరించిన రీడిజైన్ చేసిన రూ.100 నోటులో గుజరాత్‌లోని పటాన్‌లో ఉన్న 11వ శతాబ్దపు మెట్ల బావి రాణి కి వావ్ అద్భుత కట్టడం ఉంది. ఈ నిర్మాణం సరస్వతీ నది ఒడ్డున ఉన్న మెట్ల బావి. ఈ బావిని సోలంకి రాజవంశ స్థాపకుడైన కింగ్ భీం దేవ్ జ్ఞాపకార్థం 1063 లో ఆయన భార్య రాణి (మహారాణి) ఉదయమతి నిర్మించారు. తన భర్తపై ఉన్న ప్రేమకు చిహ్నంగా నిర్మించిన ఈ రాణి కి వావ్ అత్యుత్తమ నిర్మాణం కలిగి ఉంది. ఈ బావి నీటి పవిత్రతను తెలియజేసే విధంగా నిర్మించబడింది. ఈ బావి శిల్పకళా ఫలకాలతో ఏడు స్థాయిల మెట్లుగా విభజించబడింది. రాణి కి వావ్ గోడలు, స్తంభాల మీద 500 కంటే ఎక్కువ విష్ణు రూపాలైన రామ, వామన, మహిషాసురమర్దిని, కల్కి మొదలైన అవతారాలు చెక్కబడి ఉన్నాయి. రాణి కి వావ్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నం, భారత పురావస్తు శాఖ దీనిని పరిరక్షిస్తుంది.
200 రూపాయల నోటు
2017లో ఆవిష్కరించబడిన రూ. 200 కరెన్సీ నోటులో ప్రముఖ బౌద్ధ స్మారక చిహ్నం సాంచి స్థూపం వెనుక వైపున అలంకరించబడిన గేట్‌వేలు ఒకటి ఉన్నాయి. సాంచి వద్ద ఉన్న గొప్ప స్థూపం భారతదేశంలోని పురాతన రాతి నిర్మాణాలలో ఒకటి. మన దేశ వాస్తుశిల్ప కళకు ముఖ్యమైన స్మారక చిహ్నంగా నిలుస్తోంది. ఇది వాస్తవానికి 3వ శతాబ్దం BCEలో అశోక చక్రవర్తిచే నియమించబడింది. వాస్తవానికి ఇది బుద్ధుని అవశేషాలపై నిర్మించిన సాధారణ అర్ధగోళాకార ఇటుక నిర్మాణం. ముఖ్యంగా.. సాంచి అశోకుని భార్య దేవి జన్మస్థలం.. వారి వివాహ వేదిక కూడా. ఇది 12వ శతాబ్దం వరకు భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన బౌద్ధ కేంద్రాలలో ఒకటి. 1వ శతాబ్దం BCEలో, నాలుగు క్లిష్టమైన ‘తోరణాలు’ నిర్మాణాలు 200 రూపాయల నోటుతో దర్శినమిస్తుంది. ఈ గేట్‌వేలపై ఉన్న చెక్కడాలు గౌతమ బుద్ధుని జీవితం, అతని ప్రారంభ అవతారాల కథలను వర్ణిస్తాయి. సాంచి స్థూపం, సంబంధిత స్మారక చిహ్నాలు 1989 నుండి UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణించబడుతున్నాయి.
500 రూపాయల నోటు
నవంబర్ 8, 2016న నోట్ల రద్దు ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత కొత్త రూ. 500 నోటును ప్రవేశపెట్టారు. వెనుకవైపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు ఢిల్లీలోని ఎర్రకోట ఉంటుంది. మొఘల్ చక్రవర్తుల ప్రధాన నివాసంగా పనిచేసిన ఎర్రకోట అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం. 1638లో చక్రవర్తి షాజహాన్ తన సామ్రాజ్య రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు దీని నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఎర్రకోటను వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ రూపొందించారని, ఆయన తాజ్ మహల్‌ను కూడా నిర్మించారని చెబుతారు. ఈ కోటను ఖిలా-ఎ-ముబారక్ – ది ఎక్సాల్టెడ్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఆగష్టు 15, 1947 న, భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్యం పొందిన తరువాత.. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లాహోరీ గేట్ పైన భారత జెండాను ఎగురవేశారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం నాడు, ప్రధాన మంత్రి కోట ప్రధాన ద్వారం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దాని ప్రాకారాల నుండి ప్రసంగం చేస్తారు. 2007లో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
2,000 రూపాయల నోటు..
రూ.2,000 నోటులో స్మారక చిహ్నం ఏదీ లేనప్పటికీ, 2014 నుంచి అంగారకుడి చుట్టూ తిరుగుతున్న స్పేస్ ప్రోబ్ అయిన మంగళయాన్ చిత్రం ఉంది. (Source)
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..