Common krait: కట్లపాము కాటేసిందంటే ఖతమే.. అది చచ్చిన పామైనా జాగ్రత్తగా ఉండాలే..

|

Mar 26, 2023 | 6:21 PM

పాము కాటు ప్రాంతాన్ని కోసివేసి విషాన్ని తొలగించటం లేదా రక్తస్రావం జరిగేలా చేయటం వంటివి చేయకూడదని.. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది. పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయకూడదని పేర్కొంది.

Common krait: కట్లపాము కాటేసిందంటే ఖతమే.. అది చచ్చిన పామైనా జాగ్రత్తగా ఉండాలే..
Common Krait Snake
Follow us on

సహజంగా వర్షాకాలం మొదలైతే పాములు ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి. ప్రజంట్ సమ్మర్ సీజన్ కాబట్టి.. వేసవి తాపానికి సర్పాలు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో కనిపించే అత్యంత విషపూరితమైన పాముల్లో కట్లపాము మొదటి వరసలో ఉంటుంది. నాగుపాము కంటే కూడా ఇది డేంజర్. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడే కట్లపాము రకం.. కామన్ క్రెయిట్. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు ఈ పాములు ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి. చూడటానికి ఈ పాములు.. అందంగా కనిపిస్తాయి. పగటిపూట మొహమాటంగా కనిపించే ఈ పాము.. రాత్రి వేళల్లో దూకుడుగా దాడి చేస్తుంది.

ఈ పాము ప్రమాదం అనిపించినప్పుడు చుట్లు చుట్టుకొని తన తలని శరీరం కింద దాచుకుంటుంది. అవకాశం దొరికినప్పుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ పాము కాటు వేస్తే కొన్నిసార్లు పెద్దగా నొప్పి కూడా అనిపించదు. కాటేసిన చోట గాట్లు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. అన్ని పాముల మాదిరిగానే కట్లపాము సైతం వెచ్చదనం కోరినప్పుడు ఏదైనా వెచ్చటి ప్రదేశానికి వచ్చి శరీర తాపాన్ని పెంచుకుంటుంది. గడ్డివాములు, పట్టాలు, పరదాలు చాటున నక్కి  ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేలపై పడుకునే దుప్పట్లోకి వచ్చి దూరుతుంది. వీటికి పందికొక్కులంటే చాలా ఇష్టం. అందువలన, పందికొక్కుల బొర్రలలో, చెద పుట్టలలో, ఇటుకల కుప్పలలో, ఇళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. కట్లపాముకు నీళ్ళంటే కూడా ఇష్టం. అందువల్ల నీటికి సమీప ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి.

 కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ఈ పాము విషం నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది.  నిద్రలో కరిస్తే కనిపెట్టకపోతే.. మరణం సంభవిస్తుంది. విషం రక్తంలోకి చేరకముందే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీనికి ఇతర పాములను తినే స్వభావం ఉంది.. అందుకే అంత బలమైన విషంతో పుడుతుంది. ఇది 1.75 మీటర్ల (5 అడుగుల 9 అంగుళాల) వరకూ పొడవు ఉంటుంది.

 ప్రజలకు హెచ్చరిక ఏంటంటే… చనిపోయిన పాములతో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కట్ల పామును చంపేసిన కొంతసేపటి వరకూ దాని నాడీ మండలం యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంది.. దానివల్ల విషపూరిత కాటు వేయవచ్చు.