AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంతాన ఆశలో మోసపోతున్నారా? ఇదీ నిజ పరిస్థితి!

లైంగికంగా ఆల్ పర్ఫెక్ట్. కానీ.. గర్భధారణ దగ్గర సమస్యలు. మారిన లైఫ్ స్టయిల్స్, ఆరోగ్య సమస్యలు, ఊబకాయం, హార్మోన్ లోపాలు.. ఇలా అనేక కారణాలు దంపతుల్ని సంతాన భాగ్యానికి దూరం చేస్తాయి. ప్రత్యామ్నాయంగా కృత్రిమ సంతానం వైపు చూసే కేసులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. కానీ... ఇన్‌ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు తప్ప.. ఏ సెంటరైతే బెటర్... ఏ డాక్టర్ని నమ్మాలి అనేదే పెద్ద సమస్య. వీళ్ల బలహీనతల్ని సొమ్ము చేసుకోడానికి కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు మాటు వేసి ఉంటాయి. లక్షలకు లక్షలు నిలువు దోపిడీ చేస్తాయి.

సంతాన ఆశలో మోసపోతున్నారా? ఇదీ నిజ పరిస్థితి!
Surrogacy Scam
Ram Naramaneni
|

Updated on: Jul 27, 2025 | 8:02 PM

Share

సంతానం కోసం ఆరాటపడే వారు, అనారోగ్య సమస్యలున్న దంపతులు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనే అవకాశం ఉంది. ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్.. IVF… అంటే ప్రయోగశాలలో ఒక గాజు పరికరంలో జరిగే ఫలదీకరణ ప్రక్రియ. తల్లి దగ్గర అండాన్ని, తండ్రి దగ్గర వీర్యాన్ని శాంపిల్స్ తీసుకుని, ఇంక్యుబేటర్లో ఉంచి.. తల్లి గర్భంలో టెంపరేచర్‌తో సరిపోలేలా చేసి… ఐదారు రోజుల పాటు పిండాన్ని ఎదగనిస్తారు. ఆ తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఫెర్టిలిటీ సెంటర్లలో IVFతో పాటు IUI పద్ధతి కూడా ఒకటుంది. ఈ రెండూ కుదరని పక్షంలోనే దంపతులను సరోగసీకి సజెస్ట్ చేస్తారు డాక్టర్లు.

కృత్రిమ గర్భధారణ.. మొదటి దశలోనే క్లియర్ పిక్చర్ రావాలంటే 50 దాకా టెస్టులు చేయాల్సిందే. అండాన్ని, వీర్యాన్ని ముందుగా ఫ్రీజ్ చేసుకుంటామని కొందరు, తొందరగా ప్రెగ్నెన్సీ అయిపోవాలి అని మరికొందరు దంపతులు భావిస్తారు. వీళ్ల డిమాండ్ల మేరకు ఫెర్టిలిటీ సెంటర్లు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ వందశాతం సక్సెస్ రేటు అనేది శుద్ధ అబద్ధం. కానీ దంపతుల్ని ఆ విధంగా నమ్మబలుకుతారు.

1978 జూలై 25న ఇంగ్లండ్‌లో పుట్టిన లూయిస్ జాయ్ బ్రౌన్ తొలి టెస్ట్‌ ట్యూబ్ బేబీగా చరిత్రకెక్కింది. అ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల మందికి పైగా పిల్లలు ఐవీఎఫ్ పద్ధతిలో భూమ్మీదకొస్తున్నారు. 25 లక్షల మంది కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తే.. సక్సెస్ రేట్ 20 శాతానికి మించడం లేదు. డాక్టర్ల సిన్సియారిటీ ప్లస్ సీనియారిటీ రెండూ ముఖ్యమే. పైగా… అండం, వీర్య కణాలు పెరగడానికి హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తుంటారు. ఇవి మోతాదు మించితే వికటించే ప్రమాదం కూడా ఉంది.

నిజానికి… అద్దె గర్భాలకు ఇండియాలో అనుమతి లేదు. ఐవీఎఫ్, ఐయూఎఫ్ కుదరని పక్షంలో మరో ఆప్షన్ అద్దె గర్భాన్ని ఆశ్రయించడం. పెళ్లయిన తర్వాత ఐదారేళ్ల దాంపత్య జీవితం సాగించినా గర్భధారణ జరక్కపోతే సర్రొగసీ పద్ధతికి వెళ్లే ఛాన్సుంది. కానీ.. కమర్షియల్ సరోగసీని తగ్గించడం కోసం షరతులు పెంచి కొత్త చట్టం తీసుకొచ్చి కట్టుదిట్టం చేసింది కేంద్రప్రభుత్వం. తల్లి గర్భసంచి దారుఢ్యంగా ఉంటేనే సరోగసీకి అనుమతిస్తారు.

భర్తతో విడిపోయిన మహిళ గానీ, భర్తను కోల్పోయిన మహిళ కానీ సరోగసీ ద్వారా పిల్లల్ని కనొచ్చు. కానీ.. కొత్త చట్టం ప్రకారం రక్తసంబంధీకులకు స్వచ్ఛందంగా మాత్రమే గర్భసంచిని అద్దెకిచ్చే అవకాశముంది. పైగా ఒకరిద్దరు పిల్లలుండాలి.. 25 నుంచి 35 ఏళ్ల లోపు వయసుండాలి. న్యాయపరమైన చిక్కులు ఉండకూడదు. చట్టం ఇంత పకడ్బందీగా ఉన్నా.. గర్భాలు అద్దెకు తీసుకునే అక్రమ వ్యాపారం యదేచ్ఛగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు బైటికొచ్చిన సృష్టి సెంటర్ కూడా అద్దెగర్భాల కుంభకోణానికి పాల్పడ్డట్టు ఆధారాలున్నాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి..