AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scorpion Venom: అది విషం కాదు.. దివ్యౌషధం.. లీటర్ ధరెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఎక్కడైనా కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులతో పాటు ఆవులు, గేదెలు వంటి పశువులను పెంచుకుంటారు. ఇంట్లో పిల్లి, కుక్క వంటి పెంపుడు జంతువులు కూడా ఉంటాయి. కొన్ని దేశాల్లో సింహాలు, పులులు వంటి వన్య మృగాలను సైతం పెంచుకుంటారు. కానీ విష ప్రాణులను ఎవరైనా పెంచుకుంటారా? అంటే.. సాధారణంగా పెంచుకోరు.

Scorpion Venom: అది విషం కాదు.. దివ్యౌషధం.. లీటర్ ధరెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Scorpion Venom
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Mar 06, 2025 | 3:00 PM

Share

ఎక్కడైనా కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులతో పాటు ఆవులు, గేదెలు వంటి పశువులను పెంచుకుంటారు. ఇంట్లో పిల్లి, కుక్క వంటి పెంపుడు జంతువులు కూడా ఉంటాయి. కొన్ని దేశాల్లో సింహాలు, పులులు వంటి వన్య మృగాలను సైతం పెంచుకుంటారు. కానీ విష ప్రాణులను ఎవరైనా పెంచుకుంటారా? సాధారణంగా పెంచుకోరు. పాములను ఆడిస్తూ జీవనం సాగించే వర్గాలు సైతం వాటిలో విషపు కోరలను పీకేసిన తర్వాతే పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తోకలో విషాన్ని నింపుకుని తిరిగే వృశ్చికం (తేలు) కోట్లు కురిపిస్తుందని మీకు తెలుసా? అవును. ఆ తేలు తోకలో ఉండే విషమే అద్భుతమైన ఔషధంగా మారింది. కేన్సర్ సహా నరాలకు సంబంధించిన అనేక రుగ్మతలను నయం చేసే చికిత్సలో ఉపయోగపడుతోంది. అందుకే.. ఒక లీటర్ తేలు విషం మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తోంది. దీంతో తేళ్ల పెంపకంపై చాలా మంది దృష్టి పెట్టారు.

విషమే ఔషధమైన వేళ

విషం అంటే ప్రాణాలు తీస్తుంది. లేదంటే ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కానీ తేలు విషంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అందులో ఉన్న ఔషధ గుణాలతో కొన్ని రకాల వ్యాధులు, రుగ్మతలకు చికిత్స అందించవచ్చని తేల్చారు. ముఖ్యంగా కేన్సర్, న్యూరోలాజికల్ డిజార్డర్స్ (నరాల సంబంధిత రుగ్మతలు), కార్డియోవస్క్యులర్ డిసీజెస్ (హృదయం – రక్తనాళాలకు సంబంధించిన రుగ్మతలు)లను నయం చేయడంలో దివ్యౌషధంగా వినియోగించవచ్చని అనేక పరిశోధనలు తేల్చాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఈ విషాన్ని ఔషధంగా మార్చి వినియోగిస్తున్నారు.

తేలు విషంలో ఉండే పెప్టైడ్ కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయని పరిశోధనల్లో నిరూపితమైంది. గ్లియోమాస్, ల్యుకేమియా, బ్రెయిన్ ట్యూమర్లు (మెదడు కణితులు), రొమ్ము క్యాన్సర్ సహా అనేక రకాల కేన్సర్‌కు చికిత్స అందించడంలో తేలు విషంలోని పెప్టైడ్ సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. న్యూరోబ్లాస్టోమా, మెలనోమా వంటి అరుదైన నాడీ సంబంధ రుగ్మతలతో పాటు ఇతర నరాల వ్యాధులకు చికిత్సలో తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే రక్తనాళాలు – హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలోనూ వృశ్చిక విషం విశేషంగా పనిచేస్తోందని గుర్తించారు.

కేవలం చికిత్సలోనే కాదు, వ్యాధినిరోధకంగానూ దీన్ని ఉపయోగించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, అనాల్జిక్ ఔషధాల తయారీలోనూ తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు. పురుగు మందుల నివారణ, టీకాల తయారీలో సైతం తేలు విషం విశేషంగా ఉపయోగపడుతోంది. వీటన్నింటితో పాటు విషానికి విషమే విరుగుడు అన్నట్టుగా.. తేలు కాటు లేదా ఇతర విష పురుగుల కాటుకు గురైనప్పుడు ఆ విష ప్రభావాన్ని నిర్వీర్యం చేసే యాంటీ-వీనమ్ డ్రగ్స్ తయారీకి కావాల్సింది కూడా తేలు విషమే. అలాగే సౌందర్య సాధనంగానూ తేలు విషాన్ని వినియోగిస్తున్నారు.

విషంతో ప్రయోజనమే కాదు.. లాభం కూడా

ఇంతటి ఔషధ గుణాలున్న తేలు విషానికి ఇప్పుడు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రాణాంతక రోగాలకు చికిత్సను అందిస్తూ మృత్యువు నుంచి కాపాడుతున్న ఈ తేలు విషం కోసం కొన్ని దేశాల్లో తేళ్ల పెంపకం సాగిస్తున్నారు. 2016 నుంచి ఈ పెంపకం ఊపందుకుంది. కొన్ని రకాల తేళ్ల నుంచి సేకరించే విషం.. ఒక గ్యాలన్‌కు 39 మిలియన్ డాలర్లు (రూ. 325 కోట్లు) పలుకుతోంది. అంటే తేళ్ల పెంపకం ఎంత లాభదాయకమో అర్థం చేసుకోవచ్చు.

తేళ్ల పెంపకం, వాటి నుంచి విషాన్ని సేకరించడం ఎలా జరుగుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..

తేలు విషం ఖరీదు కోట్లలో ఉంది కదా అని పూర్తిగా అధ్యయనం చేయకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా తేళ్ల పెంపకం సాగిస్తే.. అది ప్రమాదకరం, ప్రాణాంతకం కూడా కావొచ్చు. అందుకే తేళ్ల పెంపకం చేయాలనుకునేవారు ముందు లోతుగా అధ్యయనం చేయడం శ్రేయస్కరం..

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..