AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumalaiah: నిస్వార్ధం, మొక్కవోని దీక్ష ఆయన సొంతం.. గ్రామాభివృద్ధికి సొంత భూములు ఇచ్చిన మాజీ సర్పంచ్!

గుంట భూమిని సైతం వదులుకొని ఈ రోజుల్లో.. తాను పుట్టి, పెరిగిన ఊరి కోసం కోట్ల రూపాయల విలువైన భూమిని త్యాగం చేశాడు ఓ మహానుభావుడు.

Tirumalaiah: నిస్వార్ధం, మొక్కవోని దీక్ష ఆయన సొంతం.. గ్రామాభివృద్ధికి సొంత భూములు ఇచ్చిన మాజీ సర్పంచ్!
Vadla Tirumalaiah
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 18, 2022 | 4:13 PM

Nizampet Ex Sarpanch Vadla Tirumalaiah: గుంట భూమిని సైతం వదులుకొని ఈ రోజుల్లో.. తాను పుట్టి, పెరిగిన ఊరి కోసం కోట్ల రూపాయల విలువైన భూమిని త్యాగం చేశాడు ఓ మహానుభావుడు. తనకున్న భూమితో పాటు, మరికొంత భూమిని కొనుగోలు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు.

ఆపెద్దాయన పేరు వడ్ల తిరుమలయ్య.. ఇతని స్వగ్రామం మెదక్ జిల్లాలోని నిజాంపేట గ్రామం.. నిజంపేట గ్రామం అభివృద్ధి కావడానికి ప్రధాన కారణం ఈ తిరుమలయ్యే..1947లో వడ్ల వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులకు నిజాంపేట్‌లో జన్మించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించినా.. అప్పటి పరిస్థితుల కారణంగా డాక్టరు కావాలనే తన కోరిక తీర్చుకోలేక పోయారు. అయినా కుంగిపోకుండా తల్లిదండ్రులకు, అదే గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంలో ఉద్యోగంలో చేరకుండా గ్రామంలో ఒక చిన్న కర్ర పరిశ్రమను నడిపిస్తూ, గ్రామస్తుల మన్ననలను పొందుతూ గ్రామ సేవ వైపు తన అడుగులను ప్రారంభించారు. తను అనుకోకుండానే సొసైటీ సెక్రటరీ ఎన్నుకోబడి, పిదప 1972లో గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1972 నుండి 2001 వరకు అంటే 21సంవత్సరాల పాటు సర్పంచ్ గా పనిచేశారు. ఆస్తులేమి లేకపోయినా, అధైర్య పడకుండా గ్రామాభివృద్ధే తన లక్ష్యంగా పని చేస్తూ వచ్చారు.

నిజాంపేట గ్రామ అభివృద్ధి కోసం మొత్తం 40 ఎకరాల స్థలాన్ని కొని, అందులో 20% గ్రామ అభివృద్ధికి కేటాయించారు…ఆ స్థలంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ కోసం 1 ఎకరం 29 గుంటల విస్తీర్ణంలో నిర్మాణం చేసారు. ఎస్సీ షాపింగ్ మాల్‌ను మొత్తం 300 గజాలలో షాపులను నిర్మాణం కోసం ఇచ్చారు. వీరబ్రహ్మం గారి గుడి కోసం 300 గజాల స్థలాన్ని ఇచ్చారు. వీటితో పాటు రైతుల మార్కెట్ యార్డ్ కోసం 2 ఎకరాల భూమిని ఇచ్చారు తిరుమలయ్య.

వీటితో పాటు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని బీసీ కాలనీ నిర్మాణం చేపట్టి మొత్తం 25 ప్లాట్లును ఒక్కొక్కటి 200 గజాల చొప్పున మొత్తం 1 ఎకరం 22 గుంటలు కేటాయించారు. మరోవైపు బీడీ కార్మికుల కోసం ఒక కాలనీని 4 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయించారు. అంగన్వాడీ భవనానికి 500 గజాలు, డ్వాక్రా భవవానికి 400 గజాలు, గ్రామ పంచాయితీ కార్యాలయానికి 1500 గజాలు కేటాయించి నిజాంపేట గ్రామ అభివృద్ధికి ఎంతగానో పాటు పడిన వ్యక్తి మాజీ సర్పంచ్ తిరుమలయ్య..

తాను సర్పంచ్ గా పని చేస్తున్న కాలంలో ఎన్నో ఆటంకాలను చవిచూసారు. గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకైన తిరుమలయ్యకు అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి. కనీస గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయుటకు సరిపడు కార్యాలయం కూడా లేదు. ప్రభుత్వ స్థలాలు గ్రామానికి అనుకూలంగా లేవు. గ్రామంలో అభివృద్ధి నిధులు లేవు. వ్యవసాయదారులు, వ్యాపారులు పరస్పరం విభేదించుకుని గ్రామ నిధి జమ కాకుండా చేశారు. గ్రామ పంచాయితీ ఆదాయం చాలా తక్కువ. అయినా నిరుత్సాహ పడుకుండా కేంద్ర, రాష్ట్ర, జిల్లా పరిషత్ ప్రభుత్వాల నుండి నిధులు మంజూరు చేసే ప్రయత్నం చేయడంతో గ్రామంలోని సామాన్య జనం, హరిజన, గిరిజన, బిసి వర్గాల వారు ఆయనకెంతో సహకరించారు. బ్యాంకులు అప్పులు ఇచ్చే అవకాశం లేదు. గ్రామంలోని పేద ప్రజల పై ధనికులకు విశ్వాసం లేదు. అలాంటి పరిస్థితులలో తన స్వంత పరపతిని ఉపయోగించి పట్టణంలో నెలసరి వడ్డీల చెల్లింపు పద్ధతి పై అప్పులు చేసి గ్రామ అభివృద్ధి పనులు చేపట్టారు.

సర్పంచ్ గా పదవిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాల విధానాన్ని అర్ధం చేసుకున్న తిరుమలయ్య, గ్రామ ప్రజలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో, ఆనాడు ప్రభుత్వ భవనాలు ప్రాథమిక పాఠశాల, హాస్టల్ లేని పరిస్థితిని అర్థం చేసుకుని లేఅవుట్ సిస్టంను అమలు చేయడానికి సంకల్పించారు. దీనికి గ్రామస్థులందరినీ ఒప్పించి,వారితో చర్చించి లేఅవుట్ అమలుకై కృషి చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “పనికి ఆహార పథకం” ఉపయోగించుకుని గ్రామంలో రోడ్లు వేయించారు. రోడ్డుకి ఆనుకుని ఉన్న 3000 గజాలను ప్రాధమిక పాఠశాలకు, RLEGP ప్రోగ్రాం కిందలక్ష రూపాయలు మంజూరు చేయించారు.. హాస్టల్ నిమిత్తం 7 లక్షలు గ్రామానికి మంజూరు అయితే గ్రామస్తుల సహకారంతో 1 ఎకరం 29 గుంటల భూమిని ఇవ్వడంతో హాస్టల్ భవననిర్మాణం పూర్తి చేసారు. 1986లో నూతన మండలాలను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేయడంతో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కరణం రామచంద్రరావుకు నిజాంపేట్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు కూడా అందజేసి చివరకు విజయం సాధించారు.

అలాగే గ్రామంలో గ్రామ క్రాంతి పథకం ద్వారా మాస్టర్ ప్లాన్ తో రోడ్లు వేయించారు. గ్రామంలోని బస్టాండ్ కోసం 731 గజాల స్థలాన్ని దానంచేసి దాన్ని గ్రామ పంచాయితి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.ఆయన నిస్వార్ధమైన,మొక్కవోని పట్టుదలకు, అంకుటిత దీక్ష కు నిజాంపేట్ గ్రామం సజీవ తార్కాణంగా నిలిచింది… ఇలాంటి వ్యక్తి తమ గ్రామంలో పుట్టడం అదృష్టం అని అంటున్నారు.. నిజాంపేట గ్రామస్థులు.. గుంటేడు స్థలం పోతే ఎన్నో గొడవలు జరుగుతాయి అని ఆలాంటిది తిరుమలయ్య తనకున్న స్థలంనే కాకుండా, భూమిని కొనుగోలు చేసి మరీ గ్రామ అభివృద్ధికి ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అని అంటున్నారు.

— శివ తేజ, టీవీ 9 ప్రతినిధి, మెదక్ జిల్లా.

Read Also…. TELANGANA BJP: తెలంగాణలో బీజేపీ దూకుడుకు కారణం అదే.. ! ఆపరేషన్ ఆకర్ష్.. ఆందోళన కార్యక్రమాల వెనుక వ్యూహమిదే..!!