Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TELANGANA BJP: తెలంగాణలో బీజేపీ దూకుడుకు కారణం అదే.. ! ఆపరేషన్ ఆకర్ష్.. ఆందోళన కార్యక్రమాల వెనుక వ్యూహమిదే..!!

ఇప్పుడప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేనప్పటికీ రాజకీయ పార్టీల హడావిడి మాత్రం మామూలుగా లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్... అలా ఓ యుద్దమే నడుస్తోంది.

TELANGANA BJP: తెలంగాణలో బీజేపీ దూకుడుకు కారణం అదే.. ! ఆపరేషన్ ఆకర్ష్.. ఆందోళన కార్యక్రమాల వెనుక వ్యూహమిదే..!!
Bandi Sanjay, Amit Shah, Nadda
Follow us
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 18, 2022 | 3:57 PM

TELANGANA BJP STRATEGIES AND REASON BEHIND ACTION PLAN: ఓవైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో ఇంకోవైపు చాపకింద నీరులా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇప్పుడప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేనప్పటికీ రాజకీయ పార్టీల హడావిడి మాత్రం మామూలుగా లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్… అలా ఓ యుద్దమే నడుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడినప్పట్నించి టీఆర్ఎస్ నేతలు తమకు ప్రధాన పోటీదారు బీజేపీనే అని భావిస్తూ దూకుడు పెంచారు. వరి ధాన్యం కొనుగోలు దగ్గర్నించి ప్రతీ విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయమే చేస్తోందంటూ గులాబీ నేతలు ఏమాత్రం వీలు దొరికినా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈక్రమంలో బీజేపీ నేతలు సైతం టీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా ఉద్యమించిన దరిమిలా ఆయన్ను అరెస్టు చేయడం.. కొన్ని రోజుల పాటు తెలంగాణ రాజకీయాల్లో కలకలానికి దారి తీసింది. తన నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కరీంనగర్‌లోని తన స్వగృహంలో దీక్షకు పూనుకున్న బండి సంజయ్‌ని అరెస్టు చేయడం, ఆయన్ని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం.. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం.. చివరికి న్యాయస్థానం జోక్యంతో ఆయనకు బెయిల్ లభించడం.. ఇవన్నీ తెలంగాణ పాలిటిక్స్‌లో పెద్ద చర్చకే దారి తీశాయి.

సంజయ్ విడుదల తర్వాత బీజేపీ జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు క్యూ కట్టారనే చెప్పాలి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు వేర్వేరు కార్యక్రమాలలో పాల్గొనేందుకు తెలంగాణకు తరలివచ్చారు. ఇలా పార్టీ నిర్దేశించిన కీలక నేతలు తెలంగాణకు రావడం.. బీజేపీ అధిష్టానం తెలంగాణలో పాగా వేసేందుకు ఎంతగా ప్రాధాన్యతనిస్తోందో తెలియజేస్తోంది. బండి సంజయ్ దూకుడు కారణంగా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని, దాన్నే ఆసరాగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో గెలిచేలా బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ దిశగా జనవరి 17, 18 తేదీలలో బీజేపీ అధినాయకత్వం పలు కమిటీలను వేసింది. ఈ కమిటీలకు పార్టీలోకి చేరే నేతలను ఎంపిక చేయడం, వారికి తగిన ఆఫర్లతో స్వాగతం పలకడం, అదేసమయంలో పార్టీ నేతల మధ్య సమన్వయం చెడకుండా చూసుకోవడం వంటి బాధ్యతలను అప్పగించారు. పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ కమిటీ మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డికి పార్టీ నేతల మధ్య సమన్వయం చెడకుండా చూసే కీలక బాధ్యతలను అప్పగించారు. అదేసమయంలో తెలంగాణలోని ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అప్పగించారు. ఇక తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి.. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావుకు ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు కట్టబెట్టారు. 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధం కావడంలో భాగంగా పార్టీలో చేరికలు, సమన్వయం, ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయానికి ఈ మూడు కమిటీలను నియమించారు.

ఇంద్రసేనారెడ్డి సారథ్యంలో ఏర్పాటైన సమన్వయ కమిటీలో శాసనమండలి మాజీ చైర్మన్‌ కె.స్వామిగౌడ్, మాజీ మంత్రులు డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్, డి.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు, మహిళా మోర్చా నాయకురాలు బండారి రాధిక సభ్యులుగా ఉన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలను పార్టీలోకి చేర్చుకొనేటప్పుడు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేసే వారిని, ప్రజాదరణ ఉన్న వారిని గుర్తించి చేర్చుకొనే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు బీజేపీ నేతలు అన్న సందేహం పలువురిలో కలుగుతోంది. దీనికి ఒకే ఒక్క సమాధానం.. 2018 మాదిరిగానే 2023 నవంబర్ కంటే ముందే.. అంటే 2023 తొలి నెలల్లో గానీ.. లేకపోతే 2022 చివరిలోగానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు భావించడమే ఈ హడావిడికి కారణమని రాజకీయ పరిశీలకులు అంఛానా వేస్తున్నారు. శాసనసభ ఎన్నికలు 2023 చివర్లో జరగాల్సి ఉన్నా అంతకంటే ముందుగానే ఇక్కడ ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాల మధ్య 119 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న, బలమైన పార్టీ ముఖ్య నేతలు పోటీకి అవకాశమున్న స్థానాలను మినహాయించి మిగతా సీట్లలో ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే తాజా కమిటీల నియామకమని పలువురు భావిస్తున్నారు.

రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ భావిస్తోంది. ఈ స్థానాల్లో కనీసం 20–25 సీట్లు గెలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను బీజేపీ నేతలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ నియోజకవర్గాల్లోని బలాబలాలు, సమస్యలపై ముఖ్యనేతలతో బండి సంజయ్‌ రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సీట్లల్లో విశ్లేషణ నిమిత్తం తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని సంజయ్‌ నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు జైపాల్, ఎం.ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు సీహేచ్‌ విఠల్, ఎస్సీ మోర్చా నాయకురాలు కాంచన కృష్ణ ఉన్నారు. అదే విధంగా ఎస్టీ స్థానాల్లో బలబలాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల అంశాల పరిశీలనకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు చైర్మన్‌గా ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని సంజయ్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలంగౌడ్, సీనియర్‌ నేత చింతా సాంబమూర్తి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి సభ్యులుగా ఉన్నారు.

జాతీయ స్థాయి నేతలు తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా కమలనాథులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి రాజేసిన జీ.వో. నెంబర్ 317కు వ్యతిరేకంగా గళమెత్తిన బీజేపీ నేతలు.. అదే ఊపులో తాము అధికారంలోకి వస్తే ఆ జీ.వో.కి సవరణలు చేస్తామని ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్ళేందుకు ఓవైపు సమస్యల అధారంగా ఆందోళనలు నిర్వహిస్తున్న బీజేపీ నేతలు.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తోంది. అదేక్రమంలో పెద్ద ఎత్తున నేతలు పార్టీలో చేరితే వారి మధ్య సమన్వయం చెడకుండా వుండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈచర్యలన్నీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నందునే తీసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.