Cow Urine: గోమూత్రం తాగడం మనుషులకు హానికరమని తాజా పరిశోధనలో వెల్లడి.. పతంజలి రియాక్షన్ ఏమిటంటే?
గోమూత్రం మంచిదా? మనిషికి మేలు చేస్తుందా? దాన్ని తాగితే సకల రోగాలు పోతాయా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది? అటు పతంజలి రియాక్షన్ ఏంటి? తెలుసుకుందాం..
మనదేశంలో ఆవుని పూజిస్తాం. గోమాతగా గౌరవిస్తాం. ఆ పవిత్ర జీవికి పూజలు చేస్తాం. గోవులోనే బ్రహ్మాండం అంతా దాగుందని పురాణాలు చెబుతున్నాయి. గోమాత ఉత్పత్తి చేసే ప్రతీదీ మనిషికి ఆరోగ్యకరమనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇలాంటి సమయంలో.. ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తాజా అధ్యయనంలో గోమూత్రం గురించి ఆసక్తికర విషయాలను వెలుగు చూశాయి. ఆవులు, ఎద్దుల మూత్రం గురించి పీర్ రివ్యూడ్ రీసెర్చ్ లో కనీసం 14 రకాల హానికరమైన బ్యాక్టీరీయాలను కనుగొన్నట్లు వెల్లడైంది. వీటిలో మానవ జీర్ణవ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపే ఎస్చెరేషియా కోలి బాక్టీరియం కూడా ఉంది. ఆవులు, గేదెలు, మానవుల 73 సాంపిల్స్ ను గణాంక విశ్లేషణకు ఉపయోగించి ఈ ప్రయోగాలు నిర్వహించారని, ఆవుల కంటే కూడా గేదెల్లో యాంటీ బాక్టీరియల్ యాక్టివిటి మరింత మెరుగ్గా ఉందని ఈ ప్రయోగాల్లో పాలు పంచుకున్న భోజ్ రాజ్ సింగ్ తెలిపారు.
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ విభాగానికి చెందిన సింగ్ తోపాటు.. మరో ముగ్గురు తన స్టూడెంట్స్ తో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనానికి సాహివాల్, థార్ పార్కర్, విందావని అనే మూడు రకాల ఆవులను ఎంచుకున్నారు. వీటితో పాటు కొంత మనుషులు, గేదెల సాంపిల్స్ కూడా సేకరించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తుల మూత్ర నమూనాలో కూడా గణనీయ నిష్పత్తిలో వ్యాధికారక బ్యాక్టిరియా ఉంటుంది.
కాని ఫూడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ట్రేడ్ మార్క్ లేకుండానే గోమూత్రం దేశవ్యాప్తంగా అమ్ముడవుతోంది. అనేక వ్యాధులకు నివారణగా గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. హిందూ సంస్కృతిలో ఆవు, గో ఉత్పత్తులకు మతపరమైన పవిత్రత ఉంది. వినియోగం, విక్రయం మీద ఎలాంటి అదుపు లేకపోవడం అంత మంచిది కాదనే అభిప్రాయం ఉంది.
అయితే.. పతంజలి యోగపీఠం జనరల్ సెక్రటరీ అండ్ పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇన్‌చార్జి ఆచార్య బాలకృష్ణ దీనిపై స్పందించారు. ఆవు ఎప్పటికీ హానికరం కాదన్నారాయన. అది ఎప్పటికీ హాని కలిగించదని.. గోమూత్రాన్ని ఉపయోగించడం వల్ల అనేక వ్యాధులను నయం చేశామన్నారు పతంజలి డైరెక్టర్. ఇలాంటి రీసెర్చ్‌ల వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందే కాని.. నిజాలను కప్పిబుచ్చలేవన్నారు. గోమూత్రాన్ని నేరుగా కాకుండా.. డిస్ట్రిల్ చేసి తీసుకోవచ్చని చుబుతున్నారు. గోమూత్రం వల్ల హాని కలుగుతుందని చెబుతూ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలపై దాడికి తెగబడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారి మాటలను మేము ఎన్నటికీ అంగీకరించమని చెప్పారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..