AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఎద్దులాంటి తెలివితేటలు ఉంటే.. ఏ ప్రమాదం నుంచైనా ఈజీగా బయటపడొచ్చు..

వయసు పైబడిన ఎద్దు ఆపదలో తన తెలివితేటలతో సింహం, నక్కలను ఎలా బోల్తా కొట్టించి ప్రాణాలు కాపాడుకుందో ఈ కథ వివరిస్తుంది. భయానక పరిస్థితుల్లో ధైర్యంగా, చాకచక్యంగా వ్యవహరిస్తే విజయం సాధించవచ్చని ఈ నీతి కథ పిల్లలకు ఆదర్శంగా నిలుస్తుంది. ..

ఈ ఎద్దులాంటి తెలివితేటలు ఉంటే.. ఏ ప్రమాదం నుంచైనా ఈజీగా బయటపడొచ్చు..
Clever Ox Story
Ram Naramaneni
|

Updated on: Oct 06, 2026 | 4:41 PM

Share

ఈ కథలో కథానాయకుడైన ఎద్దుకు ఎదురైన సవాళ్లు, వాటిని అది అధిగమించిన తీరు స్ఫూర్తిని అందిస్తుంది. కథ ప్రారంభంలో, బలహీనపడిన ఒక ఎద్దును దాని యజమాని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలివేస్తాడు. యజమాని దయలేని చర్యతో బాధపడినప్పటికీ, ఎద్దు నిరాశ చెందదు. “నేను ఒక తెలివైన ఎద్దును, నన్ను నేను రక్షించుకోగలను” అని దృఢంగా నిర్ణయించుకుంటుంది. ముందుగా సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతుంది, పచ్చగడ్డితో నిండిన ఒక మంచి స్థలాన్ని కనుగొంటుంది. భగవంతుడి దయవల్ల అది తన ఆరోగ్యాన్ని, బలాన్ని తిరిగి పొందుతుంది. అయితే, దాని సంతోషం ఎంతో కాలం నిలవదు. ఒకరోజు, ఎద్దును ఆహారంగా చూసిన ఒక భారీ సింహం దాని వైపు వస్తుంది. ప్రాణాపాయం అంచున ఉన్నప్పటికీ, ఎద్దు ఏమాత్రం భయపడదు. తన తెలివిని ఉపయోగించాలని నిర్ణయించుకుంటుంది. అది తనతో తాను మాట్లాడుతున్నట్లు నటిస్తూ, “ఆహా! ఎంత బలిష్టమైన ఎద్దు! ఈవేళ మంచి ఆహారం దొరకబోతుంది. వింటున్నావా? తయారుగా ఉండు. ఈ రోజు నీకు మన పిల్లలకు మంచి ఆహారం లభించబోతోంది. ఒక సింహం ఈ దారి గుండా వస్తుంది. ఆగాగు, నిశ్శబ్దంగా ఉండు. లేదంటే సింహం పారిపోవచ్చు” అని బిగ్గరగా అరుస్తుంది. ఇంకా, “నేను సింహాన్ని కొమ్ములతో చంపేస్తాను” అని చెబుతుంది. ఎద్దు మాటలు విన్న సింహం తీవ్రంగా భయపడుతుంది. “ఈ ఎద్దు నాకన్నా బలమైనదేమో, ఇప్పుడు అది నన్ను చంపేస్తుందేమో” అని భయపడి అక్కడి నుండి పారిపోతుంది.

సింహం భయంతో పారిపోతుండగా, ఒక గుంటనక్క దాన్ని చూస్తుంది. సింహం భయానికి నవ్విన నక్క, దాన్ని వెనక్కి రమ్మని ఒప్పిస్తుంది. సింహాన్ని నమ్మించడానికి, నక్క తన తోకను సింహం తోకకు కట్టి, ముందుండి నడుస్తుంది. ఎద్దు మళ్లీ సింహం, నక్క రావడం చూసి, మరోసారి తెలివిగా ప్రవర్తిస్తుంది. అది నక్కను ఉద్దేశించి, “ఓయ్ నక్క! నేను రెండు సింహాలను తీసుకురమ్మంటే, ఒక సింహాన్నే తీసుకొచ్చావే! ఈ బక్కచిక్కిన ఒకే ఒక సింహాన్ని నేను ఏం చేసుకోను? నేను తినాలా, నా పిల్లలు తినాలా, నా భార్య తినాలి కదా?” అని గట్టిగా అరుస్తుంది. ఎద్దు మాటలకు సింహం తీవ్ర భయాందోళనకు గురై, నక్క తనను మోసం చేసిందని భావించి, నక్కను వదిలి పారిపోతుంది. ఎద్దు తన ప్రాణాలను తెలివిగా కాపాడుకున్నందుకు ఆనందంగా నవ్వుతుంది. ఈ కథ జీవితంలో ఎప్పుడైనా ఆపద సంభవిస్తే, మీ బుద్ధి కుశలతను ఉపయోగించి, తెలివిగా ఆలోచించి, ధైర్యంగా వ్యవహరిస్తే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చని తెలియజేస్తుంది. ఈ నీతి పాఠం పిల్లలకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.

Follow Us