
ప్రేమకు ఏది అడ్డుకాదు.. ప్రాంతం, కులం, మతం అనే భేదాలు ఉండవు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు.. రెండు మనస్సులు వారిని దగ్గర చేస్తాయి. ప్రేమకు మాటలు అవసరం ఉండదని, భావం ఉంటే చాలు అనేది అక్షరాలా నిజం చేసిన అరుదైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. బూర్గంపాడులో పోలీసుల సాక్షిగా ఓ మూగ జంట ప్రేమ వివాహం చేసుకుంది.
మాటలు రాకపోయినా తమ బాసలతో ఒక్కటైంది ఈ జంట. డోర్నకల్‌కు చెందిన యువతి మల్లీశ్వరి, బూర్గంపాడు చెందిన రాజు ఇద్దరూ పుట్టి మూగ, చెవిటి. అయితే చదువుకునే సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. కానీ వీరి ప్రేమకు పెద్దలు అడ్డుగా మారారు. కులాలు వేరు కావడంతో పెళ్ళికి నో అన్నారు. దీంతో ఈ ప్రేమికులిద్దరూ భద్రాచలంలోని హనుమాన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల నుండి తమను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమికులు ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారి పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. పెళ్ళి చేసుకున్న మూగ జంటను అప్పగించారు. యువతీ యువకులు ప్రేమ పేరుతో ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్న ఈ రోజుల్లో మాటలు రాకపోయినా తమ బాసలతో ఒక్కటైనా ఈ జంటకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు స్థానికులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..