Dark Chocolate Benefits
చలికాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, జ్వరం వంటి అనేక సీజనల్ వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. అందువల్ల ఈ కాలంలో పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే చలికాలంలో చాక్లెట్లు తింటే జలుబు చేస్తుందని పిల్లలను చాక్లెట్ తినవద్దని తల్లిదండ్రులు చెబుతుంటారు. అది నిజమే కానీ డార్క్ చాక్లెట్ తింటే ఈ సమస్య ఉండకపోవడమే కాక చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే డార్క్ చాక్లెట్ తయారీలో వాడే కోకో పౌడర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్లు ధరిచేరవు.
అంతేకాక డార్క్ చాక్లెట్‌ను రెగ్యులర్‌గా సరైన మోతాదులో తీసుకుంటే చలికాలంలో శరీరంలోని వేడిని పెండి చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఈ డార్క్ చాక్లెట్లను ‘థియోబ్రామా కాకో’ అని కాకో చెట్టు భాగాల నుండి తయారు చేస్తారు. డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. మరి ఇన్ని పోషకాలున్న డార్క్ చాక్లెట్‌ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- రక్తపోటు నియంత్రణ: డార్క్ చాక్లెట్‌లో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్‌ను తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవల్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ మీ శరీరంలో సహజంగా సంభవించే పదార్ధం. ఇది రక్త నాళాలలో చిన్న గ్రాహకాలపై పనిచేసి వాటిని విడదీయడానికి సహాయపడుతుంది, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
- కొవ్వును కరిగిస్తుంది: డార్క్ చాక్లెట్ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనగా ఎల్‌డిఎల్‌ను తగ్గిస్తుంది. అదేవిధంగా, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్‌ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీంలో ఎల్డీఎల్ స్థాయి పెరిగితే ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఎల్డీఎల్ స్థాయి తగ్గుతుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గుతుంది.
- మెరుగైన మెదడు పనితీరు: జ్ఞాపకశక్తిని పెంచడానికి, మీ మెదడును ఉత్తేజం చేయడానికి డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది. 2012లో, నాటింగ్హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడులోని కొన్ని ముఖ్య ప్రాంతాలకు రక్త ప్రవాహం పెరుగుతుందని కనుగొన్నారు. ఇది మెదడు పనితీరును, అప్రమత్తతను మెరుగుపరుస్తుంది. 2013లో న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన మరో అధ్యయనంలో ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినడం ద్వారా మీ జ్ఞాపకశక్తి దాదాపు 30% పెరుగుతుందని, మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా మెరుగవుతాయని తేలింది.
- గుండె ఆరోగ్యం: డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని 2015లో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. 2014లో అమెరికన్ కెమికల్ సొసైటీ (ఎసిఎస్) సమర్పించిన మరొక అధ్యయనంలో మీరు డార్క్ చాక్లెట్ తినేటప్పుడు, మీ కడుపులోని గట్ బ్యాక్టీరియాను బయటికి పంపిస్తుందని పేర్కొంది. దీంతో ప్రతిరోజూ చాక్లెట్ తినడం వలన గణనీయమైన మొత్తంలో హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని తేలింది.
- బరువు నియంత్రణ: కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 1000 మంది అమెరిన్లపై అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో అప్పుడప్పుడు చాక్లెట్ తిన్న వారి కంటే ఎక్కువగా తిన్నవారే సన్నగా ఉన్నారని తేలింది. డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. భోజనం చేసిన తర్వాత డార్క్ చాక్లెట్‌ను తింటే బరువు పెరగడాన్ని అరికట్టే అవకాశం ఉందని మరో అధ్యయనం తెలిపింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..