Zika Virus: దేశంలో మళ్లీ జికా వైరస్ భయాలు మొదలయ్యాయి. కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాయచూర్ జిల్లాలో ఐదేళ్ల బాలికకు జికా వైరస్ సోకినట్లు రెండ్రోజుల క్రితం నిర్థారణ అయ్యింది. ఇది రాష్ట్రంలో నమోదైన తొలి జికా వైరస్ కేసు. డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలతో బాధపడుతున్న చిన్నారికి వైద్య పరీక్షలు చేయగా.. ఆమెకు జికా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. జికా వైరస్ ఎడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్ గున్యాలకు కూడా ఈ దోమే కారకం. ఎడెస్ దోమలు పగటిపూట యాక్టివ్‌గా ఉంటూ మనుషులను కుడుతాయి. మొదటిసారిగా ఈ వైరస్ 1947లో ఉగాండాలో గుర్తించారు. జికా వైరస్ ప్రాణాంతకం కాకపోయినా గర్భిణీలకు మరీ ముఖ్యంగా వారి కడుపులోని పిండానికి చాలా ప్రమాదకరం.
గర్భిణులను ఇబ్బందులకు గురి చేస్తున్న జికా వైరస్ కు వ్యాక్సిన్ తీసుకురావడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. త్వరలోనే జికా వైరస్‌కు వ్యాక్సిన్ అందిస్తామని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఎజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. జికాకు వ్యాక్సిన్‌ను భారతదేశంలో కూడా తయారు చేయవచ్చా? లేదా? అనే విషయంపై చర్చిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ ప్రభావంపై ప్రస్తుతం గర్భిణులు, వారి పిల్లలను పరిశీలనలో ఉంచామని పేర్కొన్నారు.
అలాగే గర్భాశయ క్యాన్సర్ హెచ్ పీవీ వ్యాక్సిన్‌తో నయమవుతుందని భారతదేశంలో త్వరలో 9-14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు నేషనల్ మిషన్ లో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సిన్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్‌కె అరోరా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ కారణంగా చనిపోయే వారిలో ఎక్కువ మంది భారతదేశం నుంచే ఉన్నారని వివరించారు. అయితే 35 సంవత్సరాల వయస్సు తర్వాత గర్భాశయ వ్యాధి నిర్ధారణకు స్క్రీనింగ్ ముఖ్యమని, స్క్రీనింగ్‌ని ఒక మిషన్‌గా తీసుకోవాలని సూచించారు.
మరిన్ని హెల్త్ వార్తలు చదవండి..