యోగా.. అంటే హిందూత్వ ఆథ్యాత్మిక సాధనలలో ఒక భాగం. ఇది కూడా ధ్యానం చేయడం లాంటిదే. అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి వంటి ఆధ్యాత్మిక సాధనలకు యోగా పునాది. ఇందులో రకరకాల ఆసనాలు ఉన్నాయి. ఒక్కో ఆసనం ఒక్కో అనారోగ్యాన్ని నయం చేస్తుంది. గర్భిణులు కూడా యోగాసనాలు వేస్తే.. సుఖప్రసవం అవుతుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
యోగా అంటే కేవలం ఆసనాలే కాదు.. వివిధ రోగాలను నయం చేసే ముద్రలు కూడా ఉన్నాయి. యోగా ముద్రలను పద్మాసనంలో వేస్తే.. కొన్ని రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. నిజానికి ప్రతిరోజూ యోగాసనాలు, యోగా ముద్రలు వేస్తే చాలా ఆరోగ్యంగా జీవించవచ్చు. త్వరగా ఎలాంటి అనారోగ్యాలు రావు. ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఆలోచన మారుతుంది. ఎదుటివారిని నెగిటివ్ గా చూసే తీరు మారుతుంది. యోగా మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వైద్యం లాంటిదే.
యోగా ముద్రల్లో ప్రధానమైనది వరుణముద్ర. ఈ ముద్రను ప్రతిరోజూ 5 నిమిషాలపాటు వేస్తే.. 5 రకాల అనారోగ్యాలకు చెక్ పెట్టొచ్చు. వరుణ ముద్ర ఎలా వేయాలి ? దానివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. రెండు చేతుల బొటనవేళ్లను చిటికిన వేళ్ల కొనలను ఆనించాలి. మిగిలిన మూడు వేళ్లను పైకి నిటారుగా ఉంచాలి. ఇలా వరుణ ముద్రను 5 నిమిషాల పాటు వేయాలి. ఇది చాలా తేలికగా ఉంటుంది. పెద్దగా కష్టపడనక్కర్లేదు.
ఈ విధంగా వరుణ ముద్ర వేయడం వల్ల స్త్రీలకు శరీరంలో రక్తం శుభ్రమవుతుంది. స్త్రీ, పురుషులకు మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగై.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. చర్మ సౌందర్యం పెరిగి.. చర్మం కాంతివంతంగా ఉండటంతో పాటు.. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు ఉన్నవారు వరుణముద్రను ఎక్కువ సమయం వేయకూడదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి