వేసవిలోనే కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా..? ఏం తినాలి.. ఏం తినకూడదు..?
కిడ్నీలో రాళ్లు చాలా మందిని బాధించే సమస్యగా మారింది. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి లోపం, అధిక ఉప్పు, ప్రోటీన్ ఆహారం వంటి అనేక కారణాల వల్ల ఇవి ఏర్పడుతాయి. ముందుగా లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. ఇప్పుడు మనం కిడ్నీ రాళ్ల కారణాలు, లక్షణాలు, నివారణ చిట్కాల గురించి తెలుసుకుందాం.

ఇప్పుడు చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరింతగా కనిపిస్తుంది. అయితే కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి..? దీనికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. మూత్రం వెళ్లేటప్పుడు తీవ్రమైన నొప్పి అనుభవించడంతో పాటు, మూత్రం ఎర్రటి లేదా ముదురు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. అలాగే తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, కడుపు, వెన్నుపోటు లేదా ప్రక్క భాగంలో నొప్పి రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొంతమందిలో నీరసం, వాంతులు, మలబద్ధకం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యునిని సంప్రదించడం చాలా అవసరం. ఇప్పుడు కిడ్నీలో రాళ్లు రావడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి తక్కువ నీరు తాగడం. వేసవి కాలంలో ఒంటిలో ఎక్కువగా చెమట ద్వారా నీరు కోల్పోతాం. దాంతో మూత్రంలో మలినాల సాంద్రత పెరిగి, రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
బరువు ఎక్కువగా ఉన్నవారిలో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువ. అధిక కొవ్వు నిల్వలు శరీరంలోని మెటబాలిజం మారుస్తాయి. దీని వల్ల మూత్రంలో అనేక రసాయన మార్పులు జరిగి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతాయి.
హైపర్ పారా థైరాయిడిజం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా కిడ్నీలో రాళ్లకు దారి తీస్తాయి. అవి మూత్రంలో ఖనిజ లవణాల అసమతుల్యతను కలిగించడంతో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
ప్రోటీన్ అధికంగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఎక్కువ యూరిక్ యాసిడ్ మూత్రంలో పేరుకుపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాంసాహారం, పాల ఉత్పత్తులు, అధిక ప్రోటీన్ పౌడర్లను సమతుల్యంగా తీసుకోవడం మంచిది.
ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. సోడియం అధికంగా ఉన్నప్పుడు, మూత్రంలో కాల్షియం సమతుల్యత తప్పిపోతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)