పనసపండులో విటమిన్ A, C, పొటాషియం, మగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ అందరికీ పనసపండు నప్పదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని తినకూడదు అంటున్నారు వైద్య నిపుణులు.
పనసపండులో పొటాషియం అధికంగా ఉండటంతో కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. పొటాషియం అధికంగా ఉండటంతో కిడ్నీల పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి కిడ్నీ సమస్యలున్నవారు దీన్ని తినకుండా ఉండటం మంచిది.
కొంతమందికి పనసపండు తిన్న వెంటనే చర్మం మీద దద్దుర్లు, గజ్జి, శ్వాస సంబంధిత ఇబ్బందులు రావచ్చు. అలాంటి వారిని ఇది ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు. అందుకే అలెర్జీ సమస్యలున్న వారు దీనిని తినకూడదు.
షుగర్ పేషెంట్లు పనసపండును ఎక్కువగా తినకూడదు. దీనిలో సహజమైన చక్కెర అధికంగా ఉండటంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోతే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
కొన్ని రకాల శస్త్రచికిత్సలు చేసుకున్న తర్వాత పనసపండును తినకూడదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపు సమస్యలు, గ్యాస్, ఉబ్బరం వంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి వైద్యుల సూచన మేరకే తీసుకోవడం మంచిది.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పనసపండును ఎక్కువగా తినకూడదు. ఇది కొందరిలో జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. హార్మోన్ల అసమతుల్యతను కలిగించవచ్చు. కనుక తినాలంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
పనసపండు రుచికరమైనదే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే కొందరికి ఇది హానికరం కావచ్చు. పై చెప్పిన ఆరోగ్య సమస్యలున్నవారు పనసపండును తినే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం ఉత్తమం.