ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చండి.. మలబద్ధకం మీ దరిదాపులకు కూడా రాదు..!
ప్రస్తుత రోజుల్లో మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తోంది. తగిన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, శారీరక చలనం లేకపోవడం, అవసరమైనంత నీరు త్రాగకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే కొన్ని సహజ పండ్లు జీర్ణవ్యవస్థకు సహాయం చేసి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

మలబద్ధకం అనేది ఈ రోజుల్లో చాలా మందిని బాధించే ఆరోగ్య సమస్య. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించకపోవడం, తక్కువ ఫైబర్ తీసుకోవడం, తగినంత నీరు త్రాగకపోవడం, శారీరక చలనం లేకపోవడం వంటివి మలబద్ధకానికి ముఖ్యమైన కారణాలు. దీని వల్ల మలవిసర్జన క్రమంగా జరగకపోవడం, కడుపు గట్టిపడటం, గ్యాస్, వికారం, పొట్టలో నొప్పి వంటి ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే కొన్ని సహజమైన పండ్లు ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్
డ్రాగన్ ఫలంలో పుష్కలంగా ఫైబర్, నీటి శాతం ఉంటాయి. ఈ రెండు పదార్థాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజింపజేస్తాయి. ఫైబర్ పేగుల్లోని మలాన్ని మెత్తబరచి సులభంగా బయటకు పోవడానికి సహకరిస్తుంది. అలాగే ఇది శరీరంలోని వ్యర్థాలను తేలికగా వెలివేయడంలో దోహదపడుతుంది. నిత్యం కొంతమేర డ్రాగన్ పండు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.
నారింజ
నారింజలో ఉండే సొలబుల్ ఫైబర్ మలాన్ని మెత్తబరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది పేగుల కదలికను సజావుగా కొనసాగేలా చేస్తుంది. నిత్యం ఒక నారింజ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలాన్ని బయటకు పంపే ప్రక్రియ సాఫీగా జరిగి మలబద్ధకం తగ్గుతుంది.
ప్రన్స్ (ఎండబెట్టిన ప్లమ్)
ప్రన్స్ పండ్లలో ఫైబర్ మోతాదుతో పాటు సోర్బిటాల్ అనే సహజ పదార్థం ఉంటుంది. ఇది మలాన్ని నీరుగా చేసి బయటకు పంపేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫెనోలిక్ యాసిడ్‌లు పేగుల కదలికను ప్రేరేపిస్తాయి. రోజూ రెండు నుంచి మూడు ప్రన్స్ తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
కివీ పండు
కివీ పండు ఆకర్షణీయమైన రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా మలబద్ధకానికి ఉపశమనం కలిగిస్తుంది. దీంట్లో ఉండే యాక్టినిడిన్ అనే ప్రత్యేక ఎంజైమ్ మలాన్ని సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది.
యాపిల్
యాపిల్‌లో పెక్టిన్ అనే ప్రత్యేకమైన సొలబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్‌లా పనిచేసి జీర్ణవ్యవస్థలోని ఆరోగ్యానికి మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడుతుంది. దీని వల్ల మలాన్ని సాఫీగా బయటకు పంపించేందుకు శరీరం సహాయపడుతుంది.
బొప్పాయి
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో పేపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని తేలికగా జీర్ణించేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్, నీటి శాతం పేగుల కదలికను ఉత్తేజింపజేస్తుంది. రోజు ఓ ముక్క బొప్పాయి తీసుకుంటే మలబద్ధకాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు.
వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మలబద్ధక సమస్యను తగ్గించుకోవచ్చు. పండ్లతో పాటు తగినంత నీరు త్రాగటం, రోజూ వ్యాయామం చేయటం కూడా చాలా అవసరం. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, ఫైబర్ లేని ఆహారాన్ని తీసుకోవడం మలబద్ధకానికి కారణం కావచ్చు. అందువల్ల సహజమైన, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లను ఎంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మెల్లగా ఉపశమనం పొందవచ్చు.