Soap Nuts Vs Shampoo: భారతీయుల జుట్టు అంటే గత కొంతకాలం వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. అందుకనే హాలీవుడ్ లో హీరో, హీరోయిన్లు తమ విగ్గులను స్పెషల్ గా భారతీయుల జుట్టుతోనే తయారు చేయించుకునేవారట. అయితే మన అమ్మమ్మల కాలం వరకూ జుట్టుని శుభ్రపరచుకోవడానికి కొన్ని ప్రాకృతిక పద్దతులను వాడేవారు. కుంకుడుకాయ లేదా శీకాయి రసంలో మందారం ఆకులను వేసుకుని తలకు స్నానం చేసేవారు. కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం ఉపయోగించేవారు. కుంకుడుకాయలోని సెపోనిన్ వలన నురుగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోయి వెండ్రుకలు శుభ్రపడతాయి. ఈ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే ఈ కుంకుడుకాయ రసం నివారించేది. దీంతో కుంకుడుకాయ రసం నాచురల్ షాంపూ గా పనిచేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, నల్లగా మెరుస్తూ ఉంటుంది. కుంకుడుకాయలో ఉండే విటమిన్స్ వల్ల జుట్టు సిల్కీగా, స్మూత్ గా తయారు చేస్తుంది.
అయితే సుఖ జీవనానికి అలవాటు పడిన నేటి జనరేషన్ శ్రమతో కూడిన కుంకుడికాయలను దూరం పెట్టింది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి రసాయనాలతో కూడిన షాంపూలకంటే కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెండ్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు దూరమవుతాయి.
కుంకుడు రసం చర్మ సౌందర్యానికీ, మృదుత్వానికీ, చర్మ ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను పోగొడుతుంది. కుంకుడు రసంలో ఖరీదయిన పట్టుచీరలను నానపెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఔషద సంబంధమైన ప్రయోజనాలు కుంకుడుకాయల్లో ఉన్నాయి.
అయితే ప్రస్తుతం మనిషి జీవితంలో కుంకుడుకాయ ప్లేస్ ను షాంపూ ఆక్రమించింది. మనం ఆధునికత పేరుతో ప్రాకృతికంగా లభించే వస్తువులను వాడే సంస్కృతి నుండి కార్పోరేట్ ఉత్పత్తిని కొని వాడే సంస్కృతికి తరలిపోయాం. షాంపూ రసాయనాలతో తయారవుతుంది. మనం రోజూ వాడే షాంపూలో అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం లారీల్ సల్ఫేట్ , గ్లైకాల్ , సోడియం లారీల్ సల్ఫేట్ ,
సిట్రిక్ ఆసిడ్ వంటి అనేక రసాయనాలతో తయారు చేస్తారు. దీంతో ఈ రసాయన షాంపూని రెగ్యులర్ గా వాడడం వలన నెత్తిమీద దురద, క్యాన్సర్ల వంటివి వచ్చే అవకాశం ఉంది. షాంపూ తయారీలో వాడే పదార్థాలలో 11 ని అమెరికా, 587 ని కెనడా, 1328 ని యురోపియన్ యూనియన్ నిషేధించాయి. మనం మాత్రం ఆరోగ్యాన్నీ ఇచ్చే ప్రకృతి ప్రసాదితాలను వదిలేసి.. ఈజీ, ఆధునికం పేరుతో రసాయన వస్తువులను వాడుతున్నాం.. ఆరోగ్యం బారిన పడుతున్నాం.
Also Read: Udalu Benefits: ఈ సిరి ధాన్యం ధర తక్కువ ఆరోగ్యానికి మేలు ఎక్కువ.. ఊదలు ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే వదలరుగా