Multiple Organ Failure: దేశం గర్వించతగ్గ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కరోనాతో పాటు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించారు. తన మధుర గానంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న లత ఇక లేరన్న వార్తను ఆమె అభిమాలనుతోపాటు సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న లతా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. వార్తా సంస్థ ANI నివేదికలో లతా మరణానికి కారణం మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని తేలింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం ICU లో ఎక్కువ మంది మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణిస్తున్నారని నివేదించింది. లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతిమ సమదానీ 28 రోజుల చికిత్స తర్వాత లతా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించిందని తెలిపింది. శరీరంలోని అనేక భాగాలు క్రమంగా పనిచేయడం మానేస్తే రోగి ఏకకాలంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పింది.
మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి?
శరీరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అవయవాలు పనిచేయడం మానేస్తే ఈ పరిస్థితిని మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ లేదా మల్టిపుల్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ (MODS) అంటారు. ఈ పరిస్థితిలో శరీరంలోని అనేక భాగాలతో సహా వ్యాధుల నుంచి రక్షించే రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఎన్‌సిబిఐ నివేదిక ప్రకారం.. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించినప్పుడు హెమటోలాజిక్, రోగనిరోధక, హృదయనాళ, శ్వాసకోశ, ఎండోక్రైన్ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీని కారణంగా రోగి ఏకకాలంలో అనేక సమస్యలతో బాధపడుతాడు. ఫలితంగా పరిస్థితి తీవ్రంగా మారుతుంది.
రోజంతా మూత్ర విసర్జన జరగకపోవడం, శ్వాస తీసుకోలేకపోవడం, కండరాలలో విపరీతమైన నొప్పి లేదా శరీరం వణుకుతున్నట్లు అనిపించడం వంటివి తీవ్రమైన లక్షణాలు. ఈ సందర్భంలో వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ పరిస్థితిలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి అనేక ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి. అందువల్ల రోగి పరిస్థితి విషమంగా మారుతుందని NCBI నివేదిక చెబుతోంది.