దీన్ని తాగితే ఆపరేషన్ లేకుండానే కిడ్నీ రాళ్లు బయటకి పడిపోతాయి..

కిడ్నీ, పసరు సంచి రాళ్ల మధ్య తేడాలను, వాటి చికిత్సా విధానాలను నిపుణులు వివరిస్తున్నారు. పసరు సంచిలో రాళ్లుంటే మొత్తం సంచినే తొలగించాల్సి ఉంటుంది, కిడ్నీలో రాళ్లను మాత్రం మూత్రపిండాన్ని తొలగించకుండానే చికిత్స చేస్తారు. నొప్పి లక్షణాలు, శస్త్రచికిత్స అవసరంపై ఎక్స్‌పర్ట్స్ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం ..

దీన్ని తాగితే ఆపరేషన్ లేకుండానే కిడ్నీ రాళ్లు బయటకి పడిపోతాయి..
Kidney Stones

Updated on: Feb 21, 2026 | 5:05 PM

శరీరంలోని రెండు కీలక అవయవాలలో మూత్రపిండాలు,  పసరు సంచిలో ఏర్పడే రాళ్లు చాలా మందిని ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలు. ఈ రెండు రకాల రాళ్ల మధ్య ఉన్న కీలకమైన తేడాలు, వాటి లక్షణాలు, చికిత్సా విధానాలపై సమగ్ర అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ రెండు సమస్యలపై నిపుణులు విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు.

పసరు సంచి రాళ్లు : పసరు సంచిలో రాళ్లు ఉన్నప్పుడు, చాలా మంది రోగులు కేవలం రాయిని తొలగించమని కోరతారు. అయితే అది కరెక్ట్ కాదంటున్నారు. పసరు సంచి గోడ కాగితం కంటే పల్చగా ఉంటుంది. కేవలం రాయిని తీసి తిరిగి కుట్లు వేయడానికి ప్రయత్నిస్తే, పసరు బయటకు లీక్ అయి, తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్టిస్)కు దారి తీసి ప్రాణాంతకం కావచ్చు. అందుకే, పసరు సంచిలో రాళ్లు ఉంటే, పసరు సంచి మొత్తాన్ని (చోలెసిస్టెక్టమీ) తొలగించాల్సి వస్తుంది. పసరు సంచి శరీరానికి అత్యవసరం కానందున, దీనిని తొలగించడం వల్ల పెద్ద సమస్య ఉండదు. పసరు సంచి రాళ్లకు సంబంధించి “నొప్పి లేకపోతే శస్త్రచికిత్స అవసరం లేదు” అనే నియమం ఉంది. నొప్పి ఉన్నప్పుడు మాత్రమే శస్త్రచికిత్సను పరిగణిస్తారు. ఆధునిక లాపరోస్కోపిక్ పద్ధతులలో, ఈ శస్త్రచికిత్స ఒక చిన్న రంధ్రం ద్వారా, కుట్లు లేకుండా కేవలం 15 నిమిషాల్లో పూర్తవుతుంది.

కిడ్నీ రాళ్లు: కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు, మూత్రపిండాన్ని ఎప్పుడూ తొలగించరు. రాయిని మాత్రమే తొలగిస్తారు. ఇది పసరు సంచి రాళ్లకు భిన్నమైన చికిత్సా విధానం. కిడ్నీలు రెండు వైపులా ఉంటాయి. కుడి వైపు, ఎడమ వైపు. కిడ్నీ నొప్పి సాధారణంగా రాయి కిడ్నీలోనే ఉన్నప్పుడు అంత తీవ్రంగా ఉండదు. నొప్పి ఎప్పుడు వస్తుందంటే, చిన్న రాయి కిడ్నీ నుంచి మూత్రాశయానికి మూత్రాన్ని తీసుకెళ్లే సన్నని నాళం (యురేటర్) ద్వారా ప్రయాణించేటప్పుడు ఇరుక్కుపోయినప్పుడు. ఈ యురేటర్ సుమారు 15-20 సెం.మీ. పొడవుండి, పెన్సిల్ అంత సన్నగా ఉంటుంది. రాయి దీనిలో ఇరుక్కున్నప్పుడు, మూత్రం బయటకు రావడానికి ప్రయత్నించడం వల్ల తీవ్రమైన నొప్పి (యురినరీ కోలిక్) వస్తుంది. ఈ నొప్పి మెలిపెట్టినట్లుగా, విపరీతంగా వచ్చి తగ్గుతూ ఉంటుంది.

నొప్పి లక్షణాలలో తేడాలు:

కిడ్నీ నొప్పి: ఇది సాధారణంగా నడుము వెనుక భాగం నుంచి ప్రారంభమై ముందు భాగానికి, గజ్జల వరకు వ్యాపిస్తుంది. మూత్రంలో మంట కూడా కిడ్నీలో రాళ్లకు ఒక సూచన.

పసరు సంచి నొప్పి: ఇది పై పొట్ట భాగంలో, పక్కటెముకల కింద వస్తుంది. కుడి వైపున పసరు సంచి ఉండటం వల్ల, కుడి వైపు వచ్చే నొప్పిని కొన్నిసార్లు కిడ్నీ రాళ్లతో అయోమయం చెందుతారు. అయితే, స్కానింగ్‌తో పాటు రోగి వివరణ ఆధారంగా వైద్యులు సులభంగా నిర్ధారించగలరు.

కిడ్నీ రాళ్ల చికిత్స : 1 సెంటీమీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉన్న కిడ్నీ రాళ్లు సాధారణంగా ఎక్కువ నీరు తాగడం ద్వారా దానంతట అవే బయటకు వెళ్లిపోతాయి. ఈ సందర్భాలలో శస్త్రచికిత్సను డాక్టర్లు వెంటనే సిఫారసు చేయరు. అయితే, చిన్న రాయి అయినా యురేటర్‌లో ఇరుక్కుపోయి, కిడ్నీ వాపు (హైడ్రోయురిట్రోనెఫ్రోసిస్), తీవ్రమైన నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు కారణమైతే, శస్త్రచికిత్స అవసరం అవుతుంది. కిడ్నీ వాపు, క్రియాటినిన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు, ఎక్కువ నీరు తాగడం ద్వారా రాళ్లను బయటకు పంపడానికి ప్రయత్నించవచ్చు. నిమ్మలో ఉండే సిట్రేట్‌ రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. రోజుకు 1–2 గ్లాసులు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొబ్బరి నీరు మూత్ర ప్రవాహం పెంచి, రాళ్లు బయటకు రావడంలో సహాయపడుతుంది. జావ / బార్లీ నీరు పురాతనంగా ఉపయోగించే పద్ధతి. మూత్ర మార్గాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇరుక్కున్న రాళ్లు కిడ్నీ పనితీరును దెబ్బతీయగలవు కాబట్టి, వాటిని వెంటనే తొలగించడం చాలా ముఖ్యం.

ముఖ్య సూచనలు: రోగులు తమ సమస్యలపై వైద్యులకు సూచనలు ఇవ్వకుండా, నిపుణులైన డాక్టర్లు తమ పుస్తక జ్ఞానం, అనుభవం ఆధారంగా సరైన చికిత్సా విధానాన్ని ఎంచుకునేలా చూడాలి.

Follow Us