ఈ లక్షణాలు ఉంటే పరేషాన్ అవ్వాల్సిందే..! డైరెక్ట్ గా డయాలసిస్ దాకా పోవద్దంటే.. ఇలా చేయండి..!
కిడ్నీ సమస్యలు చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే మొదలవుతాయి. అందుకే వాటిని గుర్తించడం కష్టం. అయితే మూత్రంలో ప్రొటీన్ కనిపించడం అనేది కిడ్నీలకు సంబంధించిన ముఖ్యమైన హెచ్చరిక. ఇలా జరిగితే చిన్న టెస్ట్ చేయించుకుని.. ముందుగానే చికిత్స తీసుకోవడం ద్వారా మీ కిడ్నీలను కాపాడుకోవచ్చు.

దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు (Chronic Kidney Disease) అనేది శరీరంలో నెమ్మదిగా వచ్చే సమస్య. ఇది మొదట్లో ఎలాంటి లక్షణాలు చూపకుండా చాలా కాలం తెలియకుండానే ఉండిపోతుంది. ముఖ్యంగా మూత్రంలో ఎక్కువ ప్రొటీన్ కనిపిస్తే.. అది కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పే ముఖ్యమైన హెచ్చరిక. షుగర్, బీపీ, జీవనశైలి సమస్యల వల్ల Chronic Kidney Disease ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా పెరుగుతోంది. ముందుగానే దీన్ని గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకుంటే.. సమస్య పెద్దది కాకముందే కంట్రోల్ చేయొచ్చు.
కిడ్నీలు బలహీనపడుతున్నాయా..?
మన కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. మంచి కిడ్నీలు రక్తంలోని ప్రొటీన్ లాంటి ముఖ్యమైన పోషకాలను మూత్రంలోకి పోకుండా తిరిగి పీల్చుకుంటాయి. కానీ కిడ్నీలలో రక్తాన్ని శుభ్రం చేసే వడపోత వ్యవస్థ (ఫిల్టర్ చేసే సిస్టమ్) పాడైతే అల్బ్యూమిన్ అనే ప్రొటీన్ మూత్రంలోకి రావడం మొదలవుతుంది. దీనిని డాక్టర్లు ప్రొటీనూరియా అని అంటారు. ఇది కిడ్నీ జబ్బు మొదలవుతుందని తెలిపే మొదటి సంకేతం. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే కిడ్నీ సమస్యను అదుపులో ఉంచడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
కిడ్నీ సమస్యల ఇతర లక్షణాలు
- జీర్ణ సమస్యలు, వాంతులు.. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో చెత్త పేరుకుపోయి, వాంతులు, అజీర్తి లాంటి సమస్యలు రావచ్చు.
- ఆహారం తినాలనిపించకపోవడం.. ఆకలి తగ్గిపోతుంది. కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది.
- అలసట, నిద్ర పట్టకపోవడం.. ఒంట్లో శక్తి లేకపోవడం, నిద్ర రాకపోవడం, కాళ్ళ మడమల్లో మంటలు వంటివి ఉంటాయి.
- మూత్రంలో మార్పులు.. తరచూ మూత్రం వస్తున్నట్లు అనిపించడం లేదా మూత్రం తక్కువగా రావడం మొదటి సైన్ కావచ్చు.
- బీపీ పెరగడం.. బీపీ లేదా షుగర్ ఉన్నవాళ్లకు కిడ్నీల పనితీరు మరింత గందరగోళంగా మారుతుంది.
- కాళ్ళు, మడమల్లో వాపు.. కిడ్నీలు శరీరంలోని ఎక్కువ నీటిని బయటకు పంపలేకపోతే.. కాళ్ళల్లో వాపు వస్తుంది.
లాస్ట్ స్టేజ్‌కు రాకముందే కిడ్నీ టెస్టులు
సాధారణంగా దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు మొదట్లో గుర్తించకపోతే.. అది నాలుగో లేదా ఐదో దశకు చేరుకుంటుంది. అలాంటి చివరి దశల్లో కిడ్నీలను కాపాడటానికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేసి కొత్త, ఆరోగ్యవంతమైన కిడ్నీని శరీరంలో పెడితే అది మళ్లీ తన పనిని చేయగలుగుతుంది.
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
మూత్రంలో ప్రొటీన్ కనిపిస్తే.. అది చిన్న విషయం కాదు. ఇది ఒక రకంగా శరీరం మనకు ముందుగానే ఇచ్చే హెచ్చరిక. ముఖ్యంగా ఎక్కువ బరువు ఉన్నవాళ్లు, షుగర్ హై బీపీ ఉన్నవాళ్లు లేదా కిడ్నీ సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉన్నవాళ్లు తప్పకుండా రెగ్యులర్ యూరిన్ టెస్టులు చేయించుకోవాలి. ఒక చిన్న యూరిన్ టెస్ట్ తోనే మన జీవితాన్ని కాపాడే మార్గాన్ని కనుగొనవచ్చు. దీని వల్ల సమస్యను మొదట్లోనే గుర్తించి.. భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదాల నుండి బయటపడవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




