ప్రస్తుత కాలంలో.. వయసును బట్టి ఈ అనారోగ్యాలు వస్తాయని చెప్పడానికి లేదు. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా.. చిన్న వయసులోనే అనారోగ్యాలబారిన పడుతున్నారు. సమయానికి భోజనం చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన, శరీరానికి తగిన మోతాదులో నీరు తాగకపోవడం, ఆలస్యంగా పడుకోవడం తదితర కారణాల వల్ల చిన్న వయసు నుంచే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. మీరు కూడా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లై.. రోజుకు 5 నిమిషాల పాటు.. ఇప్పుడు చెప్పే 3 ఆసనాలు వేయండి. గ్యాస్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
ఆ మూడు ఆసనాలు ఏంటంటే.. 1. పవనముక్తాసనం, 2.త్రికోణాసనం, 3. వజ్రాసనం
పవనముక్తాసనం:
నెలపై వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను దగ్గరగా ఉంచాలి. కాళ్లను మడతబెట్టి నిదానంగా ఛాతీ మీదకు తీసుకురావాలి. తలను కొద్దిగా పైకి లేపి ముందుకు వంచి.. మోకాళ్లను తాకేలా పెట్టాలి. రోజుకు కనీసం 2-3 నిమిషాలపాటు ఈ ఆసనాన్ని వేయాలి. నిదానంగా.. 5 నిమిషాల వరకూ ఆసనం వేసే సమయాన్ని పెంచుకోవాలి. ఇలా వేయడం వల్ల అన్నిరకాల జీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్య తగ్గుతాయి.
త్రికోణాసనం:
నేలపై నిలబడి కాళ్లను దూరంగా చాపుకోవాలి. ఇప్పుడు ఎడమవైపుకి వంగి ఎడమ చేతిని నేలపై ఉంచి.. చేతిని ఎడమకాలుకి దగ్గరగా ఉంచాలి. కుడిచేతిని అలాగే పైకి చాపాలి. ముఖాన్ని పైకి తిప్ప కుడిచేతిని చూస్తూ ఉండాలి. ఇలాగే రెండోవైపు కూడా చేయాలి. రోజూ 5 నిమిషాలపాటు త్రికోణాసనం వేస్తే.. గ్యాస్ సమస్య పరిష్కారమవుతుంది.
వజ్రాసనం:
ఈ ఆసనం గురించి చాలాసార్లు వినే ఉంటారు. వజ్రాసనం వేసేందుకు.. ముందుగా నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత కాళ్లను మడిచి వెనుకవైపుకు పెట్టి.. పాదాలు పిరుదుల కింద ఉంచి.. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. రెండు చేతులను ముందు రెండు తొడలపై ఉంచాలి. ఈ ఆసనం రోజూ భోజనం చేసిన తర్వాత కూడా వేయొచ్చు. ఇలా రోజూ వజ్రాసనం వేస్తే.. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి