ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఉప్పు గురించి తెలుసుకోవాల్సిందే..! లేకుంటే అంతే సంగతి..!
ఈ మధ్య కాలంలో 40 ఏళ్ల లోపు వ్యక్తుల్లో గుండె జబ్బులు అధికమవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం హిడెన్ సాల్ట్స్. ఇవి మనం ప్రతిరోజూ తినే ప్రాసెస్డ్ ఫుడ్ లో దాచిన రూపంలో ఉండి.. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. దీన్ని ఎలా గుర్తించాలి.. దాని ప్రభావం ఎలా తగ్గించాలి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో యువతలో గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వాళ్ళలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు నమోదవుతున్న గుండెపోట్లలో సుమారు 25 నుంచి 30 శాతం ఈ వయసు వాళ్ళలోనే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మన జీవనశైలి మార్పులు. ముఖ్యంగా తినే ఆహారపు అలవాట్లు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
హిడెన్ సాల్ట్స్ అంటే ఏంటి..?
మన వంటల్లో రుచి కోసం ఉప్పు వాడతాం.. ఇది మామూలే. కానీ ప్రాసెస్ చేసిన చాలా ఆహారాల్లో హిడెన్ సాల్ట్స్ కూడా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మనకు తెలియకుండానే రోజూ శరీరంలోకి వెళ్లి గుండెను దెబ్బతీస్తాయి.
ఈ హిడెన్ సాల్ట్స్ ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో ఉంటాయి. వాటిని తయారు చేసే కంపెనీలు రుచి పెంచడానికి.. ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఎక్కువ సోడియం కలుపుతారు. మనం ఆహారంలో ఉప్పు వేస్తున్నామనుకుంటాం. కానీ ఇలాంటి దాచిన సోడియం ద్వారా రోజు మొత్తం తీసుకునే ఉప్పు మోతాదు 70 శాతం దాటిపోతుంది.
ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ప్రమాదం
ఈ వేగవంతమైన జీవితంలో చాలా మంది వెంటనే తినే ఆహారాలకు అలవాటు పడుతున్నారు. స్పైసీ, డీప్ ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్ పదార్థాలు.. వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వాటిలో కొవ్వు కూడా ఎక్కువ ఉంటుంది. పీచు పదార్థం తక్కువగా ఉంటుంది.
ఇదే కాకుండా.. ఆరోగ్యానికి హానికరం కాదనుకునే పదార్థాల్లో కూడా సోడియం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు బ్రెడ్, చీజ్, పచ్చళ్ళు, నూడుల్స్, భుజియా, సూప్‌లు, పిజ్జాలు, పాస్తాలు మొదలైనవి.
ఎలా ప్రమాదకరం..?
సోడియం మన శరీరంలో నీటి సమతుల్యతను.. నరాల పనితీరును నియంత్రించే ముఖ్యమైన ఖనిజం. కానీ దాన్ని రోజుకు 1.5 నుండి 2.5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటే అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది (ఇది ఉప్పు రూపంలో చూస్తే దాదాపు 5 నుంచి 6 గ్రాములు).
ఎక్కువ సోడియం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది, రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తుంది. దీని వల్ల రక్తనాళాలు గట్టిపడి కొలెస్ట్రాల్ గడ్డలు ఏర్పడతాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్, కంటి చూపు కోల్పోవడం, రక్తనాళాల్లో బ్లాకేజీ వంటి సమస్యలకు కారణమవుతాయి.
హిడెన్ సాల్ట్స్ నుంచి దూరంగా ఉండటానికి 5 మార్గాలు
- ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించండి.. భుజియా, సాస్‌లు, ఫ్రోజెన్ పిజ్జా, నూడుల్స్, ప్రాసెస్ చేసిన మాంసాలు వంటివి తగ్గించండి.
- తాజా పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వండి.. ప్యాక్ చేసిన పదార్థాల బదులు తాజా కూరగాయలు, పండ్లు, తాజా మాంసం వాడండి.
- లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి.. సూపర్ మార్కెట్లో ఏదైనా కొనేటప్పుడు, ఆహారంలో సోడియం ఎంత ఉందో చూసుకోండి.
- ఇంట్లో వండిన ఆహారం తినండి.. బయట ఫుడ్ బదులు ఇంట్లో వంట చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
- ఉప్పు బదులు మసాలా దినుసులు వాడండి.. కొత్తిమీర, జీలకర్ర, అల్లం, నిమ్మరసం, పసుపు లాంటి రుచికరమైన దినుసులు వాడటం ద్వారా రుచి అలాగే ఉంటుంది. ఉప్పు అవసరం కూడా తగ్గుతుంది.




