Harmful Kitchen Products: మన ఇంట్లోనే ఆరోగ్యాన్ని పాడుజేసే వస్తువులు ఉన్నాయి..! అవేంటో తెలుసా..?
మన ఇంట్లో మనం రోజూ ఉపయోగించే కొన్ని వస్తువులు మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. వాటి గురించి, వాటి వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న వస్తువులపై కాస్త శ్రద్ధ వహిస్తే చాలా పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

ఇంట్లో మంచి వాసన కోసం కొవ్వొత్తులు వెలిగించడం సర్వసాధారణం. అయితే వీటిలో ఉండే ఫ్తాలేట్ (Phthalate) అనే రసాయనం శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా కొవ్వొత్తులు శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. మార్కెట్లో దొరికే చాలా కొవ్వొత్తులు పారాఫిన్ మైనం (Paraffin wax) తో తయారవుతాయి.. ఇది ఆరోగ్యానికి హానికరం. అందుకే సహజ పదార్థాలతో తయారైన కొవ్వొత్తులను ఎంచుకోవడం మంచిది.
వంటింట్లో కూరగాయలు కట్ చేయడానికి చాలా మంది ప్లాస్టిక్ కటింగ్ బోర్డులను ఉపయోగిస్తారు. వీటిని పదే పదే వాడటం వల్ల చిన్న చిన్న మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఆహారంలోకి చేరతాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి కాలక్రమేణా ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి చెక్కతో తయారైన కటింగ్ బోర్డులు వాడటం ఆరోగ్యానికి మంచిది.
నాన్ స్టిక్ పాన్ లపై గీతలు పడినప్పుడు వాటిలో ఉండే PFA (Per and Polyfluoroalkyl Substances) అనే రసాయనం ఆహారంలో కలుస్తుంది. ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, గర్భం ధరించడంలో సమస్యలు, కొంతమంది మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే స్టెయిన్ లెస్ స్టీల్ లేదా ఐరన్ తో తయారైన పాన్ లు వాడటం ఉత్తమం.
ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండే బీపీఏ (BPA), ఫ్తాలేట్ (Phthalate), సీసం (Lead), కాడ్మియం (Cadmium), పాదరసం (Mercury) వంటి రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి హార్మోన్ల మార్పులకు కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యలకు కూడా దారితీయవచ్చు. అందుకే స్టీల్ లేదా గాజు డబ్బాలను ఉపయోగించడం శ్రేయస్కరం.
చాలా మంది ఇప్పటికీ పాత వంటపాత్రలను వాడుతుంటారు. అయితే పాత పాత్రల్లో సీసం (Lead) అనే పదార్థం ఉండే అవకాశం ఉంది. ఇది చిన్నపిల్లల్లో మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. అలాగే మూర్ఛలు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి పాత వంటపాత్రలను తీసివేసి కొత్తవి వాడటం మంచిది.
ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల మైక్రోప్లాస్టిక్ అనే సూక్ష్మ రేణువులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మైక్రోప్లాస్టిక్ లు కంటికి కనిపించనప్పటికీ అవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.
ఇంట్లో వాడే వస్తువులను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సహజ పదార్థాలతో తయారైన వస్తువులు ఆరోగ్యానికి మంచివి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుంచి మనం బయట పడవచ్చు. మన ఇంట్లో ఉన్న వస్తువులపై కాస్త శ్రద్ధ వహిస్తే చాలా పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏ వస్తువు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలి.. అవసరమైతే వాటిని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో మార్చుకోవాలి.




