AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paint: వామ్మో.. కొత్త పెయింట్ వాసన యమ డేంజర్..! విషయం తెలిస్తే షాకే..

కొత్తగా పెయింట్ వేయించిన గది చూస్తుంటే ఇల్లు కళకళలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆ కొత్త రంగులు ఇచ్చే ఉత్సాహం మాటల్లో చెప్పలేం. అయితే, పెయింట్ వేయించిన తర్వాత గదిలో వచ్చే ఆ ఘాటైన రసాయన వాసనను మనం 'కొత్త వాసన' అని మురిసిపోతాం.

Paint: వామ్మో.. కొత్త పెయింట్ వాసన యమ డేంజర్..! విషయం తెలిస్తే షాకే..
Paint Fumes Health Risks.jpg
Nikhil
| Edited By: |

Updated on: Mar 11, 2026 | 12:23 PM

Share

కానీ, నిజానికి అది ఒక ప్రమాద హెచ్చరిక. పెయింట్ల నుంచి విడుదలయ్యే VOCs (Volatile Organic Compounds)మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇల్లు అందంగా కనిపించాలని రంగులు వేయిస్తాం. కానీ ఆ రంగుల వెనుక దాగి ఉన్న రసాయనాలు మన ఇంట్లోని గాలిని కలుషితం చేస్తాయని మీకు తెలుసా? పెయింట్ వేసిన గదిలోకి వెళ్ళగానే దగ్గు రావడం, గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించడం, ఛాతీలో బిగుతుగా ఉండటం వంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తాయి. మనం వీటిని సాధారణ సమస్యలుగా కొట్టిపారేస్తాం. కానీ, ఈ రసాయన ఘాటు ఊపిరితిత్తుల లోపలి పొరను వాపుకు గురిచేసి, కాలక్రమేణా ‘క్రానిక్ బ్రాంకైటిస్’ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అసలు ఏంటీ VOCs?

పెయింట్లు, వార్నిష్‌లు, థిన్నర్లలో ఉండే ఫార్మాల్డిహైడ్, బెంజీన్, టోలుయిన్ వంటి రసాయనాలను VOCs అంటారు. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద సులభంగా ఆవిరై గాలిలో కలిసిపోతాయి. యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) ప్రకారం, బయటి గాలితో పోలిస్తే ఇంట్లోని గాలిలో ఈ రసాయనాల ప్రభావం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఈ రసాయనాలను పీల్చడం వల్ల శ్వాసనాళాలు ఉబ్బి, కఫం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. నిరంతర పొడి దగ్గు, పిల్లికూతలు, గొంతు గరగర, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలగవచ్చు.

బ్రాంకైటిస్ ముప్పు..

సాధారణంగా ఈ లక్షణాలు కొద్దిసేపటి తర్వాత తగ్గిపోతాయి. కానీ, పదేపదే ఈ రసాయనాల ప్రభావానికి లోనైతే ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్నవారు, ధూమపానం చేసేవారిలో ఇది ‘క్రానిక్ బ్రాంకైటిస్’ లేదా COPD (దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి) కి దారితీస్తుంది. గాలి సరిగ్గా ఆడని గదుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఏసీలు ఆన్ చేసి కిటికీలు మూసి ఉంచడం వల్ల రసాయనాలు గదిలోనే పేరుకుపోతాయి. కిటికీలు, తలుపులు తెరిచి ఉంచి గాలి ధారాళంగా ఆడేలా చూడటమే దీనికి ప్రధాన పరిష్కారం.

సురక్షితంగా పెయింట్ వేయించడం ఎలా?

  1. Low-VOC లేదా No-VOC పెయింట్లను మాత్రమే ఎంచుకోండి.
  2. పెయింట్ వేసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి.
  3. పెయింట్ వేసిన తర్వాత కనీసం 48 నుండి 72 గంటల వరకు ఆ గదిని ఉపయోగించకండి.
  4. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నప్పుడు పెయింటింగ్ పనులు చేపట్టకపోవడమే మంచిది.

ఇంటి అలంకరణ కంటే ఆరోగ్యం మిన్న. రంగులు వేయించేటప్పుడు కేవలం అందంపైనే కాకుండా, ఆ రంగులు మీ శ్వాసపై చూపే ప్రభావం గురించి కూడా ఆలోచించండి. పెయింట్ వేయించిన తర్వాత వచ్చే ఆ ‘కొత్త వాసన’ పూర్తిగా పోయే వరకు గదిలోకి వెళ్లకుండా ఉండటమే మీ ఊపిరితిత్తులకు శ్రీరామరక్ష!

Follow Us