Weight Loss Biology: బరువు తగ్గడం ఎందుకంత కష్టం? తిండి తగ్గిస్తే శరీరం ‘ప్రమాదం’ అని భావిస్తుందా?
బరువు తగ్గడం అనేది కేవలం "తక్కువ తినడం, ఎక్కువ కదలడం" అనే సరళమైన సమీకరణం కాదు. చాలా మంది పట్టుదలతో డైటింగ్ మొదలుపెట్టినా, కొద్ది రోజులకే ఆగిపోతుంటారు లేదా తగ్గిన బరువు మళ్ళీ పెరుగుతుంటారు. దీనికి కారణం క్రమశిక్షణ లేకపోవడం కాదు.

మన శరీరంలోని సంక్లిష్టమైన ‘బయోలజీ’ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరం బరువు తగ్గడానికి ఎందుకు సహకరించదు? ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 1975 నుండి ఊబకాయం సమస్య మూడు రెట్లు పెరిగింది. మన దేశంలో కూడా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. అందరూ బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకు? ఎందుకంటే మనం బరువు తగ్గాలని డైటింగ్ మొదలుపెట్టినప్పుడు, మన మెదడు అది మన ఆరోగ్యానికి మంచిదని అనుకోదు. బదులుగా, మనం ఏదో ప్రమాదంలో ఉన్నామని, ఆహారం దొరకక ‘ఆకలితో అలమటిస్తున్నామని’ భావిస్తుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
శరీర రక్షణ కవచం..
మనం తక్కువ కేలరీలు తీసుకోవడం ప్రారంభించగానే, శరీరం తన శక్తిని ఆదా చేసుకోవడానికి ‘మెటబాలిజం’ (జీవక్రియ) వేగాన్ని తగ్గించేస్తుంది. అంటే, మీరు తక్కువ తిన్నా సరే, శరీరం చాలా తక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. దీనినే ‘మెటబాలిక్ అడాప్టేషన్’ అంటారు. దీనివల్ల బరువు తగ్గడం ఒకానొక దశలో ఆగిపోతుంది.
బరువు తగ్గడంలో రెండు ప్రధాన హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి.
1. గ్రెలిన్- ఇది ఆకలిని పెంచుతుంది.
2. లెప్టిన్- ఇది కడుపు నిండినట్లు సంకేతాలిస్తుంది.
మనం డైటింగ్ చేస్తున్నప్పుడు, గ్రెలిన్ స్థాయిలు పెరిగి, లెప్టిన్ స్థాయిలు పడిపోతాయి. ఫలితంగా విపరీతమైన ఆకలి, ఆహారంపై కోరికలు పెరుగుతాయి. ఈ హార్మోన్ల మార్పులు డైటింగ్ ఆపేసిన తర్వాత కూడా ఏళ్ల తరబడి కొనసాగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మన శరీరంలోని కొవ్వు కణాలకు ఒక రకమైన ‘జ్ఞాపకశక్తి’ ఉంటుంది. శరీరం గతంలో ఏ బరువు వద్ద ఎక్కువ కాలం ఉందో, మళ్ళీ ఆ బరువుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే బరువు తగ్గిన వారు మళ్ళీ కిలోలు పెరగడం చూస్తుంటాం. దీనికి తోడు నిద్రలేమి, ఒత్తిడి తోడైతే పరిస్థితి మరింత జటిలమవుతుంది.
అతిగా డైటింగ్..
ఒక్కసారిగా ఆహారం మానేయడం లేదా ‘క్రాష్ డైట్స్’ చేయడం వల్ల శరీరం వెంటనే ‘సర్వైవల్ మోడ్’ లోకి వెళ్తుంది. ఇది మెదడులో హై-కేలరీ ఆహారం తినాలనే కోరికను పెంచుతుంది. అందుకే బరువు తగ్గడం అనేది క్రమంగా, సహజంగా జరగాలి తప్ప బలవంతంగా కాదు. తీవ్రమైన ఊబకాయం ఉన్నవారికి కేవలం డైట్, వ్యాయామం సరిపోకపోవచ్చు. అటువంటప్పుడు ‘బేరియాట్రిక్ సర్జరీ’ వంటి వైద్య చికిత్సలు అవసరమవుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇవి కేవలం కడుపు పరిమాణాన్ని తగ్గించడమే కాకుండా, మెదడుకు వెళ్లే హార్మోన్ల సంకేతాలను మారుస్తాయి.
బరువు పెరగడం అనేది కేవలం క్రమశిక్షణ లోపం కాదు, అది ఒక వైద్యపరమైన సమస్య. మన శరీరంతో పోరాడటం కంటే, దాని పనితీరును అర్థం చేసుకుని సహకరించడం ముఖ్యం. సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం మరియు క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లతో మాత్రమే శాశ్వత బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
