
రోజూ కంప్యూటర్ పై గంటలు గంటలు పనిచేసే వారికి, ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉండే వారికి మెడ నొప్పి రావడం, మెడ పట్టేయడం సహజం. అది తీవ్రస్థాయికి వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి, నిద్ర పోయే భంగిమలు కూడా మెడ నొప్పులను తీవ్రతరం చేస్తాయి. నొప్పి కలిగిన ప్రతీసారి నొప్పి నివారణ క్రీములు రాయడం, మందులు వేసుకోవడం ద్వారా తాత్కాలిక పరిష్కారమే లభిస్తుంది. మెడ, నడుము నొప్పికి యోగా సరైన చికిత్స. యోగాసనాలు శరీరానికి ప్రశాంతతను, విశ్రాంతిని చేకూరుస్తాయి. అయితే ప్రతి రోజూ కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా ఈ నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా మెడ, నడుం నొప్పులతో బాధపడుతున్నవారికి ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా చురుకుగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో మెడ నొప్పిని తగ్గించే యోగాసనాల గురించి ఇపుడు తెలుసుకుందాం..
చక్రవాకసనం.. ఈ సున్నితమైన ఆసనం వెన్నుభాగంలో కదలికను కలిగిస్తుంది. వెన్నెముకను సాగదీస్తుంది. ఈ భంగిమను సాధన చేయడం వల్ల మీ మొండెం. భుజాలు, మెడ కూడా సాగుతుంది. ఈ యోగాసనంతో మీ వెన్నెముకను సున్నితమైన మసాజ్ లభించడం ద్వారా వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక నిమిషం పాటు ఈ ఆసనం వేయండి.
అధో ముఖ ఆసనం.. ఈ సంప్రదాయిక ఆసనం మీకు విశ్రాంతిని, పునరుజ్జీవనం కలిగిస్తుంది. వెన్నునొప్పి ఉన్నప్పుడు ఈ భంగిమను సాధన చేయడం వల్ల మీకు హాయిగా అనిపిస్తుంది. నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో అసమతుల్యతను తొలగించడానికి, సత్తువను పెంచడానికి సహాయపడుతుంది.
భుజంగాసనం.. భుజంగాసనం ప్రధానంగా ఉదర భాగాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది రక్త ప్రసరణలో సహాయపడుతుంది. వెన్నుముకను బలపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వెన్నునొప్పి, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ఈ యోగా భంగిమ పొట్ట కొవ్వును తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
బాలాసనం.. ఇది చాలా సులభమైన ఆసనం, ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మీరు మీ వెన్నుభాగాన్ని సాగదీయవచ్చు. రోజంతా పనిచేసి అలసిపోయిన రోజున, మీరు పడుకునే ముందు బాలాసనం వేయండి. మీకు ఒళ్లు నొప్పులు, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగి విశ్రాంతిగా అనిపిస్తుంది. హాయిగా నిద్రపోగలుగుతారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..