గుండె బలహీనంగా ఉంటే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే.. ఈ 5 మాత్రం యమ డేంజర్..

గుండె బలహీనపడటం ఇప్పుడు వృద్ధులలోనే కాదు, యువతలో కూడా కనిపిస్తోంది. అటువంటి పరిస్థితిలో, గుండె బలహీనంగా ఉందని చెప్పేందుకు శరీరం ముందస్తుగా కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని అస్సలు విస్మరించకూడదు.. ఎందుకంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. లక్షణాలను సకాలంలో గుర్తించడం.. చికిత్స చేయడం వల్ల తీవ్రమైన పరిస్థితిని నివారించవచ్చు.

గుండె బలహీనంగా ఉంటే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే.. ఈ 5 మాత్రం యమ డేంజర్..
Heart Health

Updated on: Aug 16, 2025 | 12:11 PM

గుండె మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. ఇది నిరంతరం శరీర కణాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. ఆక్సిజన్ – పోషకాలను సరఫరా చేస్తుంది. కానీ ఏదైనా కారణం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం బలహీనపడటం ప్రారంభించినప్పుడు, శరీరం అనేక రకాల సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. గుండె బలహీనమైనప్పుడు శరీరం ఇవ్వడం ప్రారంభించే ఆ 5 ముఖ్యమైన లక్షణాలు ఏంటి..? నిపుణులు వీటి గురించి ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

శ్వాస ఆడకపోవడం..

అపోలో హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ వరుణ్ బన్సాల్ మాట్లాడుతూ.. శ్వాస ఆడకపోవడం అనేది గుండె సమస్యకు ఒక సాధారణ.. ప్రారంభ సంకేతం. కొన్ని మెట్లు ఎక్కేటప్పుడు.. చిన్న పని చేస్తున్నప్పుడు లేదా కొన్నిసార్లు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి పదే పదే జరుగుతుంటే, దానిని అస్సలు విస్మరించవద్దు.

శరీరంలో వాపు..

గుండె బలహీనపడినప్పుడు, శరీర భాగాలకు తగినంత రక్తం అందదు. దీనివల్ల శరీరంలో ద్రవం పేరుకుపోతుంది.. ఇది సాధారణంగా పాదాలు, చీలమండలు, కాలి వేళ్లు లేదా కడుపు చుట్టూ ఎక్కువగా సంభవిస్తుంది. ఈ వాపు కారణంగా, బూట్లు తరచుగా బిగుతుగా అనిపిస్తాయి లేదా పాదాలలో బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. తరచుగా ఈ వాపు ఉదయం తక్కువగా ఉంటుంది.. చివరికి ఎక్కువగా ఉంటుంది.

విపరీతమైన అలసట – బలహీనత

గుండె సంబంధిత సమస్యల విషయంలో, ఎక్కువ పని చేయకుండానే తరచుగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. కొన్నిసార్లు తగినంత నిద్ర – విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చు. అటువంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన

గుండె సంబంధిత సమస్యల విషయంలో, హృదయ స్పందన తరచుగా వేగంగా, నెమ్మదిగా లేదా క్రమరహితంగా ఉంటుంది. ఇవి గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తోందని సూచించే సంకేతాలు. ఇది గుండె సంబంధిత సమస్యకు ముందస్తు – ముఖ్యమైన సంకేతం కావచ్చు.

తలతిరగడం లేదా మూర్ఛపోవడం

గుండె బలహీనమైనప్పుడు, మెదడుతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు తగినంత రక్త సరఫరా అందదు. దీని కారణంగా రోగి తరచుగా తలతిరగడం, మైకం లేదా అకస్మాత్తుగా మూర్ఛపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

ఇతర తీవ్రమైన లక్షణాలు..

గుండె సంబంధిత సమస్యల విషయంలో, ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లేదా నిద్రలో శ్వాస ఆడకపోవడం వంటి ఫిర్యాదులు కూడా సంభవించవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..

గుండె బలహీనతకు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి.. తద్వారా సకాలంలో పరీక్ష – చికిత్స చేయవచ్చు.. ఇంకా పరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చు.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దీనితో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం, నడక లేదా యోగా ద్వారా గుండె సంబంధిత సమస్యలను కూడా నివారించవచ్చు.

దీనితో పాటు, రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ తగినంత నిద్రపోవాలి.. ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది. అలాగే, ధూమపానం, మద్యం.. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us