AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: మీకు విటమిన్ D లోపం ఉందా.. అయితే ప్రమాదంలో పడినట్లే..

మనిషికి విటమిన్స్‌ ఎంతో ముఖ్యం. అందులో విటమిన్ D(Vitamin D) చాలా ముఖ్యం. ఎందుకంటే విటమిన్‌ D అనగానే ముందుగా ఎముకల(Bones) ఆరోగ్యమే గుర్తుకొస్తుంది...

Vitamin D: మీకు విటమిన్ D లోపం ఉందా.. అయితే ప్రమాదంలో పడినట్లే..
Vitamin D
Srinivas Chekkilla
|

Updated on: Mar 22, 2022 | 2:36 PM

Share

మనిషికి విటమిన్స్‌ ఎంతో ముఖ్యం. అందులో విటమిన్ D(Vitamin D) చాలా ముఖ్యం. ఎందుకంటే విటమిన్‌ D అనగానే ముందుగా ఎముకల(Bones) ఆరోగ్యమే గుర్తుకొస్తుంది. ఇది ఆహారం ద్వారా లభించే క్యాల్షియాన్ని శరీరం బాగా గ్రహించుకునేలా చేస్తుంది. ఇలా ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందించి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికీ శరీరానికి సహకరిస్తుంది. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటినీ పోగొడుతుంది. అంతేనా? విటమిన్‌ డి కుంగుబాటును కూడా నివారిస్తుంది. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషాన్నీ కలిగిస్తుంది. మన మెదడు(Mind) సక్రమంగా పనిచేయటానికి వివిధ న్యూరోస్టిరాయిడ్లను వాడుకుంటుంది. వీటిల్లో విటమిన్‌ డి ఒకటి. వెన్నుద్రవంలో, మెదడు అంతటా ఇది ఉంటున్నట్టు ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

డోపమైన్‌ ఉత్పత్తయ్యే సబ్‌స్టాన్షియా నైగ్రాతో పాటు మెదడులోని కీలక భాగాల్లోనూ విటమిన్‌ డి గ్రాహకాలు ఉంటున్నట్టు వెల్లడయింది. మానసిక సమస్యలకూ విటమిన్‌ డికి ప్రత్యక్ష సంబంధం ఉంటోందనటానికి ఇదే నిదర్శనం. మనం విటమిన్‌ డి అని ఒకే పేరుతో పిలుచుకుంటాం గానీ ఇందులో చాలారకాలు ఉన్నాయి. చర్మానికి ఎండ తగిలినప్పుడు 7-డీహైడ్రోకొలెస్ట్రాల్‌ పుట్టుకొచ్చి, విటమిన్‌ డి3గా మారుతుంది. ఇది కాలేయానికి చేరుకున్నాక 25 హైడ్రాక్సీవిటమిన్‌ డిగా మారుతుంది. అక్కడ్నుంచి కిడ్నీలకు చేరుకొని, చురుకైన 1.25 డైహైడ్రాక్సీ విటమిన్‌ డిగా రూపాంతరం చెందుతుంది. శరీరం వాడుకునేది దీన్నే. రోజూ కాసేపు చర్మానికి ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్‌ డి లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.

ఎండ తగిలితే సెరటోనిన్‌ అనే హార్మోన్‌ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక స్థితిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం విటమిన్‌ డి కలిపిన పాల వంటివీ దొరుకుతున్నాయి. పాలలో ట్రిప్టోఫాన్‌ అనే ప్రొటీన్‌ కూడా ఉంటుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. కుంగుబాటు లక్షణాలు తగ్గటానికి కంటి నిండా నిద్రపోవటం కీలకమన్న విషయం తెలిసిందే.

అయితే విటమిన్ D లోపం వల్ల ఎముకల ఎదుగుదల తగ్గుతుంది. ఎముకలు క్రమంగా గుళ్లబారుతాయి. అంతేకాదు నిస్సత్తువ, అలసట, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎవరికైనా విటమిన్ డి చాలా అవసరం. సంవత్సరంలోపు పిల్లలు బయట తిరుగరు కాబట్టి వారికి ఉదయం, సాయంత్ర సూర్యరశ్మి తాగిలేలా చూడాలి. ఎదిగే పిల్లలకు విటమిన్ D చాలా అవసరం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Read also.. Betel Leafs Benefits: మీకు తమలపాకు తినే అలవాటు ఉందా..? అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు..!