20 ఏళ్లకే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న యువత.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
ఇప్పటి వరకు ఎక్కువగా పెద్దవాళ్లలో మాత్రమే కనిపించిన ఫ్యాటీ లివర్ సమస్య.. ఇప్పుడు 20 ఏళ్ల యువతలోనూ కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మద్యం తాగకపోయినా ఈ సమస్య వస్తుండటం గమనార్హం. అయితే భయపడాల్సిన అవసరం లేదు. జీవనశైలిలో సరైన మార్పులు చేసుకుంటే ఈ సమస్యను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య యువతలో ఆందోళనకరంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు మారిన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి. ఈ అలవాట్లు యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతంలో ఈ జబ్బు పెద్ద వాళ్లలో కనిపించేది. కానీ ఇప్పుడు 20లలో ఉన్న యువతలో కూడా వస్తోంది. చాలా సార్లు ఎలాంటి గుర్తులు కనిపించకుండానే ఇది ముందుకెళుతుంది. ముఖ్యంగా మద్యం తాగకపోయినా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అనే సమస్య యువతను పట్టి పీడిస్తోంది.
నిర్లక్ష్యం వద్దు
ఫ్యాటీ లివర్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. అది నెమ్మదిగా నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH), ఫైబ్రోసిస్, సిర్రోసిస్, చివరికి లివర్ క్యాన్సర్ కు దారితీయవచ్చు. అయితే శుభవార్త ఏంటంటే.. మొదట్లోనే ఈ సమస్యను గుర్తిస్తే నిపుణుల సలహాతో జీవనశైలిని మార్చుకోవడం ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవడానికి ఐదు ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెడిటరేనియన్ డైట్ (Mediterranean Diet)
మెడిటరేనియన్ డైట్ కాలేయానికి చాలా మంచిది. ఇందులో పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు, ఆలివ్ నూనె, కొవ్వుండే చేపలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వాపును తగ్గించే గుణాలు కాలేయంలో కొవ్వు చేరడాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.
రోజూ వ్యాయామం తప్పనిసరి
ప్రతిరోజూ 30 నిమిషాలు సాధారణ వ్యాయామం చేయడం లేదా వారానికి కనీసం 150 నిమిషాలు కసరత్తు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను అదుపులో పెట్టొచ్చు. ఒకే చోట కదలకుండా కూర్చునే నిశ్చల జీవనశైలి (sedentary lifestyle) అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) పెరగడానికి ప్రధాన కారణం. కాబట్టి యాక్టివ్‌గా ఉండటం చాలా ముఖ్యం.
అధిక బరువు
సరైన ఆహారం తీసుకుంటూ.. వ్యాయామం చేస్తూ నెమ్మదిగా బరువు తగ్గడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును సమర్థవంతంగా తగ్గించవచ్చు. ఒక్కసారిగా బరువు తగ్గడానికి ప్రయత్నించకుండా.. క్రమంగా, నిలకడగా బరువు తగ్గేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చక్కెర పరిమితి
ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల లివర్ లో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే పండ్ల రసాలు, సాఫ్ట్ డ్రింకులు, స్వీట్లు వంటి వాటిని తగ్గించాలి. బదులుగా తక్కువ గ్లైసెమిక్ విలువ ఉండే ధాన్యాలు, తృణధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
కాఫీ ప్రయోజనం
చక్కెర లేకుండా తాగే బ్లాక్ కాఫీ కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలపై ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే కాఫీ తాగడంలో మితంగా ఉండాలి. రోజుకు రెండుసార్లు బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ ఎంజైమ్‌లు సమతుల్యంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




