AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్న తప్పులే మీ యవ్వనాన్ని దూరం చేస్తున్నాయి..! ఇలా చేసి చూడండి.. అంతా సెట్ అయిపోద్ది..!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ వయసు కన్నా పెద్దగా కనిపిస్తున్నామని బాధపడుతున్నారు. దీనికి కారణం మన శరీరం బలహీనపడటం కాదు.. మనం పాటిస్తున్న కొన్ని అలవాట్లే. సరిగా నిద్రపోకపోవడం, పొగతాగడం.. అలాగే మనం తినే ఆహారం వంటివి మన చర్మాన్ని ముందే ముసలితనం వైపు తీసుకెళ్తున్నాయి.

ఈ చిన్న తప్పులే మీ యవ్వనాన్ని దూరం చేస్తున్నాయి..! ఇలా చేసి చూడండి.. అంతా సెట్ అయిపోద్ది..!
Look Older Than Age
Prashanthi V
|

Updated on: Jul 27, 2025 | 10:21 PM

Share

మన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపించడం కొందరికి కామనే అయిపోయింది. దీనికి కారణం శరీర వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం కాదు.. మనం అలవాటు చేసుకున్న జీవనశైలి అలవాట్లే. మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు.. మనకు తెలియకుండానే వృద్ధాప్య దశను తొందరగా తీసుకొస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమి

ఒక మనిషి రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్రపోవాలి. కానీ చాలా మందికి ఇది సాధ్యం కాదు. తక్కువ నిద్ర వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల చర్మ కణాల పునరుత్పత్తి నెమ్మదిస్తుంది. ముడతలు త్వరగా కనిపించడానికి దారితీస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతిని, జ్ఞాపకశక్తి సమస్యలు, ఊబకాయం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చక్కెరతో చర్మానికి నష్టం

చక్కెరతో తయారయ్యే పదార్థాలను తరచూ తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పాడవుతాయి. ఇది చర్మంలోని సహజమైన మెరుపును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ చక్కెర వల్ల శరీరంలో ఇన్‌ ఫ్లమేషన్ పెరిగి వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించడానికి కారణమవుతుంది.

సన్‌స్క్రీన్ వాడకం తప్పనిసరి

ఎండలో ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ లేకుండా బయట తిరగడం వల్ల చర్మం నేరుగా UV కిరణాల ప్రభావానికి గురవుతుంది. ఇవి చర్మ కణాలను దెబ్బతీస్తూ ముడతలుగా మారేలా చేస్తాయి. దీర్ఘకాలంలో చూస్తే చర్మ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి సన్‌ బ్లాక్ తప్పకుండా వాడాలి.

పొగతాగడం

పొగతాగడం వల్ల శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన కణాలు నశించిపోతాయి. ముఖ్యంగా చర్మానికి చేరే ఆక్సిజన్ మోతాదును తగ్గిస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారిపోయి, రంగు మారి, వృద్ధాప్య లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. పొగతాగడం వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.

దీర్ఘకాలిక ఒత్తిడి

నిరంతరం ఒత్తిడిలో ఉండడం వల్ల శరీరంలోని కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. దీని ప్రభావం శరీరంలోని కణజాలాలపై పడుతుంది. చాలా కాలం ఇదే స్థాయిలో ఉంటే శరీర వ్యవస్థ త్వరగా వృద్ధాప్య దశలోకి ప్రవేశిస్తుంది. ఇది గుండె ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది.

అనారోగ్యకరమైన ఆహారం

రోజువారీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోకపోతే శరీరం లోపల బలహీనంగా మారుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తింటే శరీరం లోపలి నుంచి దెబ్బతిని బయటి రూపాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చర్మం పాడవుతుంది. వృద్ధాప్య లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి.

శారీరక శ్రమ లేకపోవడం

రోజువారీ జీవితంలో శారీరక శ్రమ లేకుండా ఉండటం శరీర పనితీరును నెమ్మదిస్తుంది. వ్యాయామం చేయడం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. శరీరం యవ్వనంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఇది చాలా అవసరం. కానీ ఇది లేకపోతే నిద్రలేమి, బరువు పెరగడం, చర్మం నిస్తేజంగా మారడం లాంటి సమస్యలు వస్తాయి.

మద్యం ఎక్కువగా తీసుకోవడం

మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నీరసంగా మారుతుంది. శరీరంలోని నీరు పోయి చర్మం పొడిబారుతుంది. కాలేయంపై భారం పడటం వల్ల శరీరానికి అవసరమైన శుభ్రత తక్కువవుతుంది. ఫలితంగా చర్మం ముడతలుగా, వయసు పెరిగినట్లుగా కనిపించడానికి కారణమవుతుంది.

ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లా అనిపించినా.. చాలా కాలం తర్వాత ఇవే మన యవ్వనాన్ని త్వరగా తగ్గించేస్తాయి. కాబట్టి ఈ అలవాట్లను గుర్తించి మార్చుకుంటే.. ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటం సాధ్యమే.