AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pancreatic Cancer: ఈ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టం.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..!

ప్యాంక్రియాస్ మన శరీరంలో ఆహారం అరిగించడంలో, రక్తంలో చక్కెర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇందులో కణాలు అదుపు లేకుండా పెరిగితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది. ఈ వ్యాధి మొదట్లో లక్షణాలు తెలియకపోయినా.. తరువాత తీవ్రమవుతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన సంకేతాలను ముందుగానే గమనించడం అత్యంత అవసరం.

Pancreatic Cancer: ఈ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టం.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..!
Pancreatic Cancer
Prashanthi V
|

Updated on: Aug 31, 2025 | 9:33 PM

Share

ప్యాంక్రియాస్ అనేది మన పొట్ట వెనుక ఉండే ఒక ముఖ్యమైన అవయవం. ఇది మనం తిన్న ఆహారాన్ని అరిగించడంలో, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్యాంక్రియాస్‌లోని కొన్ని కణాలు అదుపు లేకుండా పెరిగితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది. మొదట్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడవు. కానీ అది ముదిరే కొద్దీ ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిని ముందుగా గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కామెర్లు (Jaundice)

మీ చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారితే అది కామెర్లకు సంకేతం. ప్యాంక్రియాస్‌లో కణితి (ట్యూమర్) ఏర్పడితే అది పిత్త వాహికను అడ్డుకుంటుంది. దీని వల్ల రక్తంలో పసుపు రంగు పదార్థం పేరుకుపోతుంది. దీంతో మూత్రం ముదురు రంగులో, మలం రంగు మారడం, చర్మం పసుపు రంగులోకి మారడం జరుగుతుంది.

వెన్నునొప్పి, కడుపు నొప్పి

పొట్ట పైభాగంలో మొదలయ్యే నొప్పి వెనుక వైపుకు వ్యాపిస్తే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు ఒక ముఖ్యమైన సంకేతం. కణితి పెరిగే కొద్దీ నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పి పదే పదే వస్తుంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.

చర్మం దురద

చర్మంపై బిలిరుబిన్ అనే పదార్థం పేరుకుపోతే దురద వస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారిలో ఇది కామెర్లతో కలిపి ఎక్కువగా ఉంటుంది. చర్మం బాగా దురదగా ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

కారణం లేకుండా బరువు తగ్గడం

మీ ఆహారపు అలవాట్లు, వ్యాయామంలో ఎలాంటి మార్పులు లేకుండా బరువు తగ్గుతుంటే అది ప్రమాద సంకేతం. క్యాన్సర్ పెరిగే కొద్దీ శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అందుకే బరువు తగ్గుతారు. అలాగే కణితి వల్ల పొట్టపై ఒత్తిడి పెరిగి త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.

డయాబెటిస్ రావడం

మీ కుటుంబంలో ఎవరికీ డయాబెటిస్ లేకపోయినా.. మీకు ఒక్కసారిగా డయాబెటిస్ వస్తే అది ఈ వ్యాధికి ఒక సంకేతం కావచ్చు. కణితి కారణంగా ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ తయారు చేసే కణాలు దెబ్బతింటాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

అలసట

మామూలుగా అలసట చాలా కారణాల వల్ల వస్తుంది. కానీ బరువు తగ్గడం, కడుపు నొప్పి, ముదురు మూత్రం లాంటి లక్షణాలతో పాటు తీవ్రమైన అలసట ఉంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత బాగా నిద్రపోయినా అలసటగా అనిపిస్తే ఇది గమనించాల్సిన లక్షణం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)