AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారాసెటమాల్ వాడితే అంత ప్రమాదమా? డొనాల్డ్ ట్రంప్ వాదనలో నిజమెంత..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. గర్భిణీ స్త్రీలు టైలెనాల్ (పారాసెటమాల్) తీసుకోవద్దని ట్రంప్ సూచించారు. ఈ ఔషధం పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఈ ఔషధం వాస్తవానికి ఆటిజంకు కారణమవుతుందా? ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఎమంటున్నారు..? తెలుసుకుందాం.

పారాసెటమాల్ వాడితే అంత ప్రమాదమా? డొనాల్డ్ ట్రంప్ వాదనలో నిజమెంత..?
Paracetamol
Balaraju Goud
|

Updated on: Sep 23, 2025 | 5:28 PM

Share

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రిస్క్రిప్షన్ మందులలో ఒకటైన పారాసెటమాల్‌పై ఇటీవల ఒక పెద్ద వివాదం చెలరేగింది. పారాసెటమాల్‌ను టైలెనాల్ అనే బ్రాండ్ పేరుతో అమెరికాలో చెలామణి అవుతుంది. టైలెనాల్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భధారణ సమయంలో ఈ మందు తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం రావచ్చని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ట్రంప్ వాదన సరైనదేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానం ఏంటీ?

టైలెనాల్ అనేది పారాసెటమాల్ బ్రాండ్ పేరు. ఇది విస్తృతంగా ఉపయోగించే ఓవర్-ది-కౌంటర్ మెడిసిన్. ఇది నొప్పి నివారిణిగా, జ్వరం తగ్గించేదిగా పనిచేస్తుంది. పారాసెటమాల్ సాధారణంగా తలనొప్పి, వెన్నునొప్పి, చిన్న ఆర్థరైటిస్ నొప్పి, పంటి నొప్పులు, కండరాల నొప్పులు వంటి చిన్న నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది తాత్కాలికంగా జ్వరాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది.

పారాసెటమాల్ వల్ల ఆటిజం వచ్చే ప్రమాదం ఉందా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాజీ చీఫ్ సైంటిస్ట్, ప్రఖ్యాత శిశువైద్యురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్, పారాసెటమాల్ సురక్షితమైన, ప్రభావవంతమైన మందు అని స్పష్టంగా పేర్కొన్నారు. “పారాసెటమాల్-ఆటిజం మధ్య ఎటువంటి సంబంధాన్ని సమర్ధించడానికి ప్రస్తుతం ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.” అని అన్నారు. పారాసెటమాల్ తయారీదారులు, అంతర్జాతీయ వైద్య సంస్థలు గర్భిణీ, పాలిచ్చే మహిళలకు పారాసెటమాల్ సురక్షితమైనదని, కానీ వైద్యుడి మార్గదర్శకత్వంలో మాత్రమే తీసుకోవాలని సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.

పిల్లల వైద్యుడు డాక్టర్ అరుణ్ షా సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. పారాసెటమాల్ అత్యంత సురక్షితమైన మందులలో ఒకటి అని అన్నారు. ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టుల సమాఖ్య (FIGO) దీని వాడకాన్ని సిఫార్సు చేస్తుంది. వైద్యుడి సలహా మేరకు ఈ మందును తీసుకోవడంలో ఎటువంటి సమస్య లేదు. JAMA జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన కూడా దాని భద్రతను నిర్ధారిస్తుందని డాక్టర్ అరుణ్ షా తెలిపారు.

పారాసెటమాల్ ఎందుకు నమ్మదగిన ఔషధం?

జ్వరం, ఇతరల నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్‌ను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా సూచించబడే మందులలో ఇది ఒకటి అని డాక్టర్ స్వామినాథన్ వివరించారు. తలనొప్పి, పంటి నొప్పులు, వెన్నునొప్పి, కండరాల బెణుకులు, ఋతు నొప్పితో సహా అన్ని రకాల చిన్న నొప్పులకు ఇది ప్రభావవంతంగా ఉంటుంది. డాక్టర్ నిర్దేశించిన విధంగా ఉపయోగించినప్పుడు ఇది పూర్తిగా సురక్షితం. ఏదైనా ఔషధం లాగానే, పారాసెటమాల్‌ను దీర్ఘకాలికంగా, అధికంగా వాడటం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం వంటి హాని కలుగుతుందని ఆమె హెచ్చరించారు. అయితే, సాధారణ, అవసరమైన ఉపయోగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

డొనాల్డ్ ట్రంప్ వాదన ఎమంటే..?

తన ప్రకటనలో, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గర్భిణీ స్త్రీలు టైలెనాల్‌ను నివారించాలని సూచించారు. ఇది పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. అయితే, అతను ఎటువంటి ఖచ్చితమైన శాస్త్రీయ డేటాను లేదా వైద్య అధ్యయనాలను ఉదహరించలేదు. అతను కేవలం, “మహిళలు దీనిని తీసుకోకపోతే ఎటువంటి హాని లేదు, వారు కొంచెం నొప్పిని భరించాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు.

ట్రంప్ వాదనలను ఖండించిన టైలెనాల్‌ కంపెనీ

టైలెనాల్‌ను తయారు చేసే కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ వాదనను తోసిపుచ్చింది. “ఇప్పటి వరకు ఉన్న అన్ని పరిశోధనలు, శాస్త్రీయ డేటా పారాసెటమాల్-ఆటిజం మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని చూపిస్తుంది” అని స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..