Dehydration: శరీరంలో తగినంత నీటి శాతం ఉండాలని నిపుణులు చెబుతుంటారు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తాగాలంటారు వైద్యులు. కానీ ప్రస్తుతం హడావిడి జీవితాలలో చాలా మంది ఈ నీరు తీసుకునే విషయంలో ఆశ్రద్ధ చేస్తుంటారు. రోజులో కనీసం లీటర్ వాటర్ కూడా తాగరు. దీంతో డీహైడ్రేషన్ కు గురవ్వడం.. శరీర అవయవాల పనితీరు మందగించడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నీరు ఎప్పుడు తాగాలి ? మన బాడీకి నీరు ఎంతవరకు అవసరం అని అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాలను చాలా సులభంగా నివృత్తి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీరు లేకపోతే అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండా.. మణికట్టుపై చర్మాన్ని ఒక్కసారిగా పైకి లాగి వదిలితే.. అది వెంటనే యథాస్థితికి వస్తే శరీరంలో తగినంత నీరు ఉన్నట్లుగా చెబుతారు. అలాకాకుండా ముడతలు పడుతూ.. వెంటనే పూర్వస్థితి రాకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురైందని అర్థం. అలాంటి సమయంలో వెంటనే ఒక గ్లాసు నీరు తాగాలి. అంతేకాకుండా… డీహైడ్రేషన్ కు గురైన వారు వీలైనంత వరకు నీడలో ఉండాలి.
డీహైడ్రేషన్ లక్షణాలు..
డీహైడ్రేషన్ కు గురైన వారిలో కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. వారి చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాగ్గా అనిపిస్తుంది. అంతేకాకుండా.. వారిలో యూరిన్ సమస్యలు తలెత్తుతాయి. మైకం వస్తుంది. కండరాలు నొప్పిస్తాయి. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. కొందరిలో గుండె వేగంగా కొట్టుకవడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కేవలం వేసవి కాలంలో మాత్రమే శరీరం డీ హైడ్రేషన్ కు గురవ్వాలని ఏం లేదు. అన్ని కాలాల్లో శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.