Health News: కొంతమంది ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే మెడికల్ షాప్‌కి వెళ్లి ట్యాబ్లెట్లు కొని తెచ్చుకొని మింగుతారు. వైద్యుడి సలహా కూడా పాటించరు. ఇది చాలా ప్రమాదకరం. ట్యాబ్లెట్లు అనేవి ఎప్పుడైనా వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ప్రతి ఆరోగ్య సమస్యకి ట్యాబ్లెట్లు వేసుకోవడం అందరికి అలవాటైంది. చాలామంది పోషకాహార లోపం ఉన్నా సరే విటమిన్ సప్లిమెంట్లు మింగేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వీటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఓ అధ్యయనంలో తేలింది. మరణాన్ని వాయిదా వేయాలంటే మంచి ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే చాలు. అంతేకానీ విటమిన్ సప్లిమెంట్లు వేసుకుంటే సరిపోదు. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. దీర్ఘకాలిక అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే సమతులాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కానీ వీటిని పాటించకుండా చాలామంది విటమిన్ ట్యాబ్లెట్లపై ఆధారపడుతున్నారు. దీనివల్ల ఉన్న రోగాలు తగ్గిపోవడం ఏమో కానీ ఎక్కువవుతున్నాయి. 30,000 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి.
పదేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఎవరెవరు ఏ ఆహారాలు తీసుకున్నారు. ఎటువంటి సప్లిమెంట్లను మింగారు అనేది గమనించారు. పోషకస్థాయిలను అంచనావేశారు. ఏళ్లపాటూ కొనసాగించిన అధ్యయనంలో 3,600 మందికి పైగా మరణించారు. వారిలో 945 మంది గుండె జబ్బులు, 805 మంది క్యాన్సర్ తో అకాల మరణం బారిన పడ్డారు. ఇందులో అధికశాతం మంది పోషకాలు సరిగా అందక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. విటమిన్ ట్యాబ్లెట్లు కూడా వ్యాధితీవ్రతను పెంచుతాయని ఈ సర్వేలో తేలింది. పోషకాహారలోపానికి మంచి ఆహారం తీసుకోవడం ఒక్కటే మార్గమని అధ్యయన నిపుణులు తెలిపారు.